వైసిపిలోకి దివ్యవాణి…? జనసేన పై కామెంట్

ప్రముఖ నటి, టిడిపి నాయకురాలు దివ్యవాణి త్వరలోనే అధికార వైసిపిలో చేరనున్నట్టు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. రీసెంట్ గా జరిగిన ఎపి ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించగా, టిడిపి ఘోరపరాజయం పాలైంది. ఈ క్రమంలో చాలా మంది టిడిపి నేతలు వైసిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దివ్యవాణి కూడా వైసిపిలోచేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను దివ్యవాణి ఖండించారు.

దివ్యవాణి మాట్లాడుతూ..తాను టిడిపికి రాజీనామా చేయడం లేదని ఆమె తేల్చి చెప్పారు. డబ్బు కోసం, పదవి కోసం తాను వైసిపిలో చేరబోనని, తాను టిడిపిలోనే ఉంటానని ఆమె తేటతెల్లం చేశారు. గత ఎన్నికల్లో వైసిపికి 175 సీట్లకు 175 సీట్లు వస్తే తాను చాలా సంతోషించేదాన్నని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన చంద్రబాబు ఓడిపోవడం బాధాకరమైనప్పటికీ, ఈ ఓటమి వల్ల చంద్రబాబుకు తన కుటుంబంతో గడిపే అవకాశం వచ్చిందని, తన మనువడు దేవాన్ష్ తో ఇప్పడు తీరికగా ఆయన ఆడుకోవచ్చని ఆమె తెలిపారు.

ఎపి ప్రజలు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నట్టు ఆమె చెప్పారు. వైసిపిలో చేరాలని తనను ఎంతో మంది ఆహ్వానించారని, తాను మాత్రం నో చెప్పానని ఆమె వెల్లడించారు.

అలాగే జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ…తాను జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై ఎప్పడూ విమర్శలు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. జనసేనతో కలిసి పని చేయాల్సిన అవసరం టిడిపికి లేదని ఆమె పేర్కొన్నారు.