వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే ఏపీలో ముందస్తు ఎన్నికలా.?

Elections

ఈ ఏడాది చివరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేసి మందస్తు ఎన్నికలకు వెళతారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అసెంబ్లీని రద్దు చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న ఓ గాసిప్. ఈ విషయమై కొత్త మంత్రుల్లో ఒకింత అలజడి కూడా రేగుతోంది.

‘కనీసం రెండేళ్ళయినా మంత్రి పదవి లేకపోతే ఎలా.?’ అన్నది సదరు మంత్రుల ఆవేదన. రెండేళ్ళు కాదు, పూర్తిగా ఏడాది కూడా వుండదన్నమాట.. ఒకవేళ ఈ ఏడాది చివర్లో గనుక అసెంబ్లీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రద్దు చేస్తే.

అయితే, ‘మేమెందుకు ముందస్తు ఎన్నికలకు వెళతాం.?’ అని వైసీపీ నుంచి ఈ గాసిప్స్‌పై స్పందన వస్తోంది. అసలంటూ ముందస్తు ఎన్నికల ఆలోచనే లేకపోతే, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటాయ్.? పొత్తుల గురించిన పంచాయితీ ఎందుకు.? టీడీపీ – జనసేన కలవడంపై ముఖ్యమంత్రి ఎందుకు తొందరపడి స్పందిస్తున్నారు.? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజమే.

టీడీపీ – జనసేన గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు ప్రకటనలు చేస్తున్నారంటే, దానర్థం అధికార పక్షం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టే. అందుకే, విపక్షాలూ అలర్ట్ అయ్యాయి. ‘ఎన్నికలొస్తున్నాయ్.. సిద్ధంగా వుండండి..’ అంటూ తమ తమ పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపుతున్నాయి కూడా.

ఒకవేళ నవంబర్ చివర్లో గనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీని రద్దు చేస్తే, జనవరి నెలాఖరులో లేదంటే ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.? అన్నది వేచి చూడాల్సిందే.