ప్రజలను తికమక పెట్టి వేల కోట్ల రూపాయల అవినీతికి చంద్రబాబునాయుడు లాకులెత్తిన స్విస్ ఛాలెంజ్ విధానానికి వైసిపి ప్రభుత్వం మంగళం పాడనున్నట్లు అర్ధమవుతోంది. రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం చంద్రబాబుకు రాగానే భారీ ఎత్తున అవినీతికి తెర లేచింది. ఆ విషయాలు మామూలు జనాలకు అర్ధం కాకుండా ఉండేందుకే చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ అనే పద్దతిని తెరపైకి తెచ్చారు.
ఈ పద్దతిలో ఎన్ని మెలికలున్నాయో అంతే స్ధాయిలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగేందుకు అవకాశం కూడా ఉంది. ఆ పద్దతిలో రాజధాని నిర్మించాల్సిన అవసరం లేదని హై కోర్టు చెప్పింది. నిపుణులు, మాజీ ఐఏఎస్ అధికారులు కూడా స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకించారు. ఎంతమంది వ్యతిరేకించినా చంద్రబాబు మాత్రం వెనక్కు తగ్గలేదు.
సరే చంద్రబాబు జపం చేస్తున్న స్విస్ ఛాలెంజ్ పై కొందరు కోర్టుకు వెళ్ళటంతో అప్పటికి ఆ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఈ మొత్తం స్విస్ ఛాలెంజ్ లో సింగపూర్ కన్షార్టియానిదే పై చేయి. కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టే కన్షార్టియానికి భారీ లబ్ది జరిగేలా చంద్రబాబు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. సరే ఏమైందో తెలీదు కానీ మొత్తానికి చంద్రబాబు అనుకున్నట్లుగా రాజధాని నిర్మాణమైతే అసలు మొదలే కాలేదు.
ఇదంతా ఇపుడెందుకంటే స్విస్ ఛాలెంజ్ పై అభిప్రాయం చెప్పమంటూ హై కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి స్విస్ ఛాలెంజ్ ను జగన్మోహన్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి కోర్టుకు కూడా అదే విషయాన్ని చెబుతారనటంలో సందేహం అవసరం లేదు. అంటే చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ పద్దతికి మంగళమే.