టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ మీద టీడీపీ, వైసీపీల నడుమ పెద్ద రగడే నడుస్తన్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్ష అని టీడీపీ అంటే వైసీపీ నేతలు అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కొంతమంది మీడియా సమక్షంలో ఇక టీడీపీకి మూడింది, రోజుకొకరు చొప్పున అరెస్ట్ అవుతారు అంటుండటం, కొందరైతే ఏకంగా తర్వాత ఎవరనేది పేర్లతో సహా చెబుతుండటంతో ఈ అరెస్టులు పక్కా స్కెచ్ ప్రకారం జరుగుతున్నాయని లేకుండా అరెస్ట్ కాబోయే వారి జాబితా నేతలకు ఎలా తెలుస్తోంది అంటున్నారు.
దీనిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. టీడీపీ నేతలు రోజుకు ఒకరు అరెస్ట్ అవుతారని, మా మంత్రులు అనడం సరికాదు. మంత్రుల వ్యాఖ్యల వలన కావాలని చేసినట్లు ఉందని అనుకుంటారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికే చెడ్డపేరు అంటూ మీడియా ముందు అరెస్టుల గురించి ఇష్టానుసారం కామెంట్స్ చేసిన నేతలను కౌంటర్ వేశారు. అంతేకాదు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదని అన్నారు.
అంతమంది పోలీసులు వెళ్లి అంత నాటకీయంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని పైగా ఆయన్ను చూడటానికి చంద్రబాబు నాయుడుకు అనుమతి ఇవ్వకపోవడం కూడా సరైనది కాదని, అది మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని వ్యాఖ్యానించారు. ఏ తప్పూ చేయకపోతే అరెస్ట్ చేయలేరు కదా.. ఒకవేళ ఇవి రాజకీయ కక్ష చర్యలే అయితే రేపు కేసులు నిలబడవు, అప్పుడు ప్రభుత్వానికే చెడ్డపేరు. కాబట్టి ఆధారాలు లేకుండాలేకుండా అరెస్టులు జరగవని చెప్పారు.
