జగన్ సర్కార్ మొదటినుంచీ తనదైన శైలి నిర్ణయాలతోనే ముందుకు వెళ్తుంది. రేపటి నుంచి సచివాలయంతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు తప్పనిసరిగా ఉద్యోగాలకు హాజరు కావాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక పక్క రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయినా, జగన్ మాత్రం ప్రభుత్వ కార్యకలాపాల మీదే దృష్టి పెట్టాడు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారు, గర్భవతులు, పెద్ద వయసు వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం ఇంటి నుంచి పనిచేసేందుకు జగన్ అవకాశం కల్పించాడు. ఆ స్థితిలో ఉన్నవారు ఇంటి దగ్గర ఉండి ఎలా పని చేస్తారో జగన్ కే తెలియాలి.
ఇంతకీ ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారు సరే, మరి.. కరోనా నుండి వారికి రక్షణ ఎలా ? కార్యాలయాల ముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారా ? లేక చేతులను శానిటైజ్ చేసుకుంటే సరిపోతుంది అంటారా ? అందర్నీ కార్యాలయంలోకి అనుమతించాక..వారిలో ఎవరికైనా కరోనా ఉంటే మిగిలిన వాళ్లకు కూడా చాలా సులభంగా సోకే అవకాశం ఉంది కదా..? అందుకే కదా, విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలి అని చెబుతుంది అంటారేమో మన నాయకులు. అన్నట్టు జగన్ ఆదేశాల్లో ఒక ఉద్యోగికి మరొక ఉద్యోగికి మధ్య ఆరడుగుల భౌతిక దూరం ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మరి ఫైల్స్ ఎలా మార్చుకుంటారు ? ఎంత దూరం పాటించినా ఒకరు ముట్టుకున్న వస్తువును మరొకరు ముట్టుకుంటారు కదా, అప్పుడేం చేస్తారు ?
రెండు గంటలకోసారి సబ్బు, శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని అంటున్నారు, ఒక కార్యాలయంలో పదుల సంఖ్యల్లో పని చేస్తారు, వారందరికీ కామెన్ టాయిలెట్ ఉంటుంది, మరి రెండు గంటలకు పదుల సంఖ్యలో ఆ కామెన్ టాయిలెట్ ను ఉపయోగించాక.. దానికే కరోనా సోకితే.. అందరికీ వచ్చే అవకాశం లేదంటారా…? మరి ఇవ్వన్నీ ప్రభుత్వం ఆలోచిస్తోందా ? పైగా ఉద్యోగులు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. పాపం ఉద్యోగులకు కరోనా కంటే, ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారింది.