చంద్రబాబు వల్లే నేతలు టీడీపీని వీడి పోతున్నారు?

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ నుండి భారీగా నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితులుగా ఉన్న వారు సైతం పార్టీని వీడిపోతున్నారు.. పోయిన తర్వాత ఊరికే ఉండటం లేదు.. పార్టీ మారడానికి గల కారణం చంద్రబాబే అంటున్నారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి రామ సుబ్బా రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పార్టీ మారబోతున్నారు అని ఎంతో కాలంగా ప్రచారం సాగినా వాటికి ఆయన సమాధానం చెప్పలేదు. అయితే వైసీపీలో చేరడానికి ఒక్క రోజు ముందే టీడీపీని వీడేదిలేదని, అవన్నీ పుకార్లేనని, ఎప్పటికీ టీడీపీలో ఉంటామని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే వ్యాఖ్యలు చేసి ఒక్క రోజు గడవక ముందే వైసీపీ కండువా కప్పేసుకున్నారు.

పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి అని మీడియా అడిగితే.. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాల వల్లే పార్టీ మారాల్సి వచ్చిందని సమాధానం చెప్పారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తుంటే మధ్యలో వచ్చిన వారికి మంత్రి పదవి ఇవ్వడం సమంజసమేనా.. అని ప్రశ్నించారు. కేసులు పెట్టిన, జైల్లో ఉంచినా పార్టీని వీడలేదు. నన్ను నా కుటుంబాన్ని రాజకీయంగా భూస్థాపితం చేయాలనుకున్నారు. కాబట్టే వైసీపీలో చేరాం.. అని చల్లగా చెప్పారు. కేవలం రామసుబ్బారెడ్డి మాత్రమే కాదు.. కడప జిల్లా పులివెందులకు చెందిన మరో బలమైన నేత సతీష్ రెడ్డి కూడా.. చంద్రబాబు నమ్మక పోవడం వల్లే తాను పార్టీ మారానని అన్నారు. ఇక డొక్కా లాంటి వారు అయితే సరే సరి. అయితే అందరికన్నా ముందు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద దుమారమే లేపారు. 

ఏది ఏమైనా పోతే పోయారు, రాజకీయ భవిష్యత్తు కోసమో, లేదా తమను నమ్ముకున్న ప్రజల కోసమే అయితే బాగుండేది కానీ.. ఇంత కాలం చంద్రబాబును పొగడ్తలో ముంచిన వారే ఇప్పుడు ఇలా నోటికొచ్చి మాట్లడటమే బాబును అమితంగా బాధిస్తోందట.