చంద్రబాబుకు ఊపిరి లూదిన జగన్మోహన్ రెడ్డి !?

40 యేళ్ళ అనుభవం నేర్పని పాఠాలు

చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రికి బద్ద వైరం కదా?ఏ చిన్న అవకాశం దొరికినా జైలుకు పంపాలని చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు నాయుడును కూడా ఊచలు లెక్క బెట్టేట్టు చేస్తే తనతో సమానంగా ఖైదీ నెంబరు ఒకటి ఇప్పించితే పీడ వదిలి పోతుందని భావించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు బలం చేకూర్చడమేమిటనే సందేహం ఎవరికైనా రావచ్చు. అయితే ఈ కథనం చదివారంటే మీరే అంగీకరించి చప్పట్లు కొడతారు.

2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. 175 శాసన సభ స్థానాలుంటే కేవలం 23 మంది మాత్రమే టిడిపి తరపున ఎన్నికైనారు.151 మంది వైసిపి తరపున ఎన్నికైనారు. ఇద్దరు నేతలు రాయలసీమ వారే. సీమ లో 52 శాసన సభ స్థానాలుంటే కేవలం మూడు చోట్ల మాత్రమే టిడిపి అభ్యర్థులు గెలుపొందారు. రాజకీయంగా చూస్తే ప్రతి పక్షాలకు ఏలాంటి అవకాశాలు ఇవ్వకుండా ముఖ్యమంత్రి వ్యవహార సరళి వుండి వుంటే కనీసం ఒక సంవత్సరం కాలం ప్రతి పక్షాలు రోడెక్కే పరిస్థితి వుండేది కాదు. మరీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలైనారు. ఒక్క ఎమ్మెల్యే గెలుపొందినా ఆయన అప్పుడే గోడ దూకేశారు.

మరి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి? పార్టీ నిర్మాణమే లేక చిత్తుగా ఓడి పోయిన విశాఖ లో పవన్ కళ్యాణ్ ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ పెడితే జనం వెల్లువులా వచ్చారు. ఇందుకు అవసరమైన ఇంథనం ప్రభుత్వమే సమకూర్చిందని చెప్పాలి. అధికారం చేపట్టగానే ఇసుక సరఫరా బంద్ చేసి లక్షలాది మందికి ఉపాధి లేకుండా చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుక పాలసీ మార్పుచేయదలచి నపుడు ఒక వేళ వరదలు వచ్చినా ఇసుక లభ్యం కాలేదనే నెపం మోయ వలసి వుంటుందని ముందు జాగ్రత్తగా నిల్వలు చేసి వున్నా లేదా కొత్త పాలసీ ప్రకటించే వరకు ఇసుక జోలికి పోకుండా వుండి వుంటే చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మూడు మాసాల్లోనే విశాఖ రోడ్డు ఎక్కే అవకాశం వుండేది కాదు.

Also Read  

అమరావతి – ఒక వర్గం కోసం జరుగుతున్న నాటకాన్ని ఒక సమాజం చూస్తూ ఉంది.

రాధాకృష్ణ పరమ రోతపలుకులు

అదే విధంగా ప్రజాకర్శక పథకాలైన నవ రత్నాలు చక్కగా అమలు చేసుకుంటూ రాజధాని గొడవ ఇప్పట్లో ముట్టుకోకుండా వుంటే చంద్రబాబు నాయుడు వీధుల్లోనికి వచ్చే అవకాశమే వుండేది కాదు. పార్టీ కార్యకర్తల సమావేశాలకే పరిమితం అయ్యే వారు. ఆయనకు రాజకీయంగా ప్రజల మధ్య ప్లాట్ ఫారం ఇప్పట్లో వుండేది కాదు. ఘోరమైన ఓటమి నుండి తేరు కోవడానికి కనీసం ఒక సంవత్సరం పట్టేది. ఇప్పుడే మైంది? చంద్రబాబు నాయుడుకు చక్కటి ప్లాట్ ఫారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమకూర్చారు. వివాదాస్పదమైన మూడు రాజధానుల ముచ్చట తెర మీదకు రాగానే జిల్లాలో ఘోరంగా ఓడిపోయినా మచిలీపట్నం చంద్రబాబు నాయుడు వెళ్లుతుంటే విజయవాడ నుండి మచిలీపట్నం వరకు మహిళలు హారతులు పట్టారు. జనం వెల్లువెత్తారు. మచిలీపట్నం సభలో విద్యుత్ కట్ అయితే వందలాది మంది సెల్ ఫోన్ల లైట్లు వేసి ప్రసంగం విన్నారు. అంతే కాదు – చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా చిత్తూరులో తను తప్ప అన్ని చోట్ల ఘోరంగా ఓడిపోయారు. కాని తిరుపతి పర్యటనకు వెళ్లితే జనం నీరాజనం పట్టారు.

మరీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం అయింది. ఇదంతా చంద్రబాబు నాయుడు ఘనత ఏమీ కాదు. టిడిపి పార్టీ కేడర్ కృషి ఏ మాత్రం కాదు. రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన సమస్యలు జనాన్ని రోడ్ల మీదకు తెచ్చింది. తిరుపతిలో అయితే టిడిపి నేతలనందరినీ ముందుగా హౌస్ అరెస్టు చేశారు. అయినా జనం చంద్రబాబు నాయుడు వెంట నడచారు. పైగా పోలీసులు ఒక చోట వరకే పర్మీషన్ ఇస్తే జనం ముందు పోలీసులు మిన్న కుండి పోవలసి వచ్చింది.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా పదవి చేపట్టిన తర్వాత గైకొంటున్న నిర్ణయాలలోని ఉచితానుచితాలు పక్కన బెడితే మరి కొంత కాలం ఇళ్లకే పరిమితం కావాల్సిన ప్రతి పక్ష నేతలు వీధుల్లోనికి వచ్చే అవకాశం మాత్రం ముఖ్యమంత్రి చక్కగా అనువుగా కల్పించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడించిన జనమే తిరిగి వారి వెంబడి పరుగులు పెట్టే అవకాశం కల్పించారు. ఇంత స్వల్ప కాలంలోనే ప్రతి పక్ష నేతలకు చక్కటి ప్లాట్ ఫారం దొరికిందంటే వారి ఘనతేమీ కాదు. ముఖ్యమంత్రి గైకొంటున వివాదాస్పదమైన నిర్ణయాలే. కొసమెరుపు ఏమంటే తనకు అఖండ విజయం కట్టబెట్టిన రాయలసీమ వాసుల ఆకాంక్షలు నెర వేర్చడమూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కత్తి మీద సామే.

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013