ఏపీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్

ఏపీ, తెలంగాణ నడుమ జలవివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.  ఏపీ సీఎం, నాయకులు పరిధిల్లోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నామని చెబుతున్నా తెలంగాణ నేతలు మాత్రం తమకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని అంటున్నారు.  నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ చాలా తెలివిగా మాట్లాడారు.  ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కోర్టులో ఉన్న సంగతని, టైమ్ వచ్చినప్పుడు మాట్లాడతానని అంటూ ఏపీ వేసిన చిక్కు ప్రశ్న పాలమూరు – రంగారెడ్డి విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరిస్తే ఓకే అని తలూపి మీ ప్రాజెక్ట్స్ మీరు కట్టుకోండి, మావి మేం కట్టుకుంటాం అంటూ వెళ్లిపోయారని, దీనిపై కేంద్రానికి కూడా ఒక అవగాహన ఉందని అనేశారు.  
 
ఈ స్టేట్మెంట్లో ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు ప్రాజెక్ట్ ఆపేది లేదనే కేసీఆర్ ధోరణి స్పష్టంగా వినిపిస్తోంది.  ఇక ఏపీతో ఉన్న దోస్తీ మీద స్పందించిన ఆయన మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, అప్పుడు ఎలా సఖ్యతగా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నాం.  మా మధ్య కిరికిరి పెట్టాలని చూస్తే కుదరదు.  స్నేహపూర్వకంగా చెప్తున్నాం మా ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉన్నంతవరకు ఒకే.. కాదు కోట్లాటే అంటే కోట్లాటకు దిగుతాం అంటూ అన్నారు.  ఈ మాటల్లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఏపీ ఉపసంహరించుకుంటే మంచిదని, లేకుంటే జగడం తప్పదనే స్వీట్ వార్నింగ్ స్పష్టంగా తెలుస్తోంది.  
 
కేసీఆర్ వార్నింగ్ మాత్రమే కాదు ఒక సలహా కూడా ఇచ్చారు.  గోదావరి జలాల్లో ఇరు రాష్ట్రాలు వాడుకోగా ఇంకా వెయ్యి టీఎంసీల నీరు ఉంటుందని, అందులో కొంత రాయలసీమ తీసుకుపొమ్మని తామే చెప్పామని అన్నారు.  గత ఏపీ ప్రభుత్వం నిరసనలు తప్ప ఏమీ చేయలేదని, మహారాష్ట్ర ప్రభుత్వంతో తానే మాట్లాడి తానే జలాలను తీసుకొచ్చానని, అంతేకాక ఇంకో 650 టీఎంసీల నీటిని అదనంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.  
 
కేసీఆర్ చెప్పిన గోదావరి జలాల సలహా పాతదే అయినా ఆ నీటిని రాయలసీమకు తీసుకెళ్లాలంటే సామాన్య విషయం కాదు.  ఇప్పటివరకు ఏపీ తలపెట్టని భారీ ప్రాజెక్టులు చేపట్టాలి.  అందుకోసం లక్షల కోట్ల వ్యయం, ఎన్నో ఏళ్ల సమయం వెచ్చించాల్సి ఉంటుంది.  ఈ పని చేయడమంటే సాహసమే అవుతుంది.  దాన్ని భరించగల శక్తి ప్రజెంట్ ఏపీకి ఉందా అంటే డౌటే.  కానీ కేసీఆర్ మాత్రం సాహసానికి పూనుకోండి కానీ కృష్ణా జలాల జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని, కోట్లాడి తీరతామని తేల్చేశారు.  మరి కేసీఆర్ సలహా, వార్నింగ్ విషయంలో వైఎస్ జగన్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.