భారతీయ జనతా పార్టీ పూటకో మాట మారుస్తోంది. కేంద్ర నాయకత్వం ఒక మాట చెబితే రాష్ట్ర నాయకత్వం ఇంకో మాట చెబుతుంది. అమరావతి విషయంలో తమ జోక్యం ఉండదని అది రాష్ట్రం ఇష్టమని మోదీ తేల్చి చెప్పగా రాష్ట్ర శాఖ మాత్రం తాము అమరావతికి కట్టుబడి ఉన్నామని అంటున్నారు. ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేసున్న బీజేపీ అమరావతిని ఎలా నిలబెడతారో అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. సందర్భాన్ని బట్టి పలుమార్లు స్టేట్మెంట్స్ మార్చే కమలనాథులు తాజాగా కూడ ఇంకోసారి మాట మార్చారు. ఒకప్పుడు రాష్ట్రానికి మూడు రాజధానులు కాదు ప్రతి జిల్లాను ఒక రాజధాని చేస్తామని చెప్పిన సోము వీర్రాజుగారు తాజాగా అమరావతిని కాపాడి తీరుతామని అనేశారు. అంతేకాదు మోదీ ప్రతినిధిగా చెబుతున్నానని అనడం కొసమెరుపు.
అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది బీజేపీ లక్ష్యం. ఇందులో రెండో అంశానికి తావు లేదు. రాష్ట్ర బీజేపీ కార్యాలయం విజయవాడలోనే కడుతున్నాం. సీఎం మూడు రాజధానులు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మోదీ అమరావతి వైపే ఉన్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తయింది, ఎయిమ్స్ హాస్పిటల్ ఆగలేదు, ఇది కూడ ఆగదు. మోదీ ప్రతినిధిగా చెబుతున్నా అమరావతిలోని రాజధాని ఉండాలి. అందుకోసం ఉద్యమం కూడ చేస్తాం. బీజేపీ మాట తప్పదు. 2024లో అధికారం ఇవ్వండి. అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తాం అంటూ మాట్లాడారు. దీన్నిబట్టి మోదీ ఎన్నికల సమయానికి అమరావతి కార్డును అధికార వైసీపీకి వ్యతిరేకంగా వాడాలని గట్టిగా భావిస్తున్నట్టు భావించాలి. ఇది ద్వంద వైఖరి కాకపోతే మరేమిటి.
సోము వీర్రాజుగారి నోటి వెంట ఈ మాట వచ్చింది అంటే అది తప్పకుండా పై నుండి అందిన ఆదేశమే అయ్యుండాలి. గతంలో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు వీర్రాజుగారు. అంతేకాదు చంద్రబాబును సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంగా అధ్యక్ష పదవి నుండి పక్కకు తప్పించారు. కాబట్టి వీర్రాజుగారు కేంద్ర నాయకుల నుండి క్లారిటీ తీసుకోకుండా మాట్లాడరు. మరి ఫైనల్ నిర్ణయం ఇదే అయినప్పుడు ఇన్నాళ్లు డొంకతిరుగుడు వ్యవహారం నడపడమెందుకనే అనుమానం రావొచ్చు. ఎందుకంటే అమరావతి స్టాండ్ తీసుకుంటే చంద్రబాబుకు మద్దతిచ్చినట్టు అవుతుంది. అదీ కాక బలంగా ఉన్న జగన్ ను ఢీకోట్టినట్టు ఉంటుంది. ఈ రెండు కూడ వారికి మంచివి కావు. అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ వారికి టార్గెట్. తీసుకునే ప్రతి నిర్ణయం వారి ఇరువురికీ నష్టం చేసేలానే ఉండాలి. అందుకే ఇన్నిరోజులు నాన్చుడు ధోరణి అవలంభించి ఇప్పుడు బయటపడ్డారు.