ఏపీ టిడిపిలో పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. పార్టీ ప్రయోజనాలకంటే నేతల స్వంత ప్రయోజనాలకే విలువ ఇచ్చుకొని ఎవ్వరికీ వారే పావులు కదుపుతుండటంతో విజయవాడ రాజకీయంలో కోల్డ్ వార్ ప్రారంభమైంది. నేతలు తమ పరిధిని మరిచి ఇతర ప్రాంతాలలో కూడా రాజకీయ పర్యటనలు, చర్చలు జరుపుతుండటంతో స్థానికంగా ఉన్న నేతలకు అది తలనొప్పిగా మారింది. దీంతో బెజవాడ రాజకీయం కాస్త రసవత్తరంగా మారింది.
పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లకు.. తెలుగు యువత నేత దేవినేని అవినాష్ చెక్ పెడుతున్నాడు. ఆ దిశగా ఆయన పావులు కదుపుతుండటంతో ఆ ఎమ్మెల్యేలకు కొరకరానీ కొయ్యగా దేవినేని అవినాష్ తయారయ్యాడు. దేవినేని అవినాష్ తన తండ్రి దేవినేని నెహ్రు వర్గం అండదండలతో విజయవాడలో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పార్టీలో కీలక యువనాయకుని అండదండ ఉండటంతో ఆయన తన దూకుడు పెంచి ప్రవర్తిస్తున్నాడు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు, దేవినేని నెహ్రు వర్గంలోని కొంతమంది నేతలకు మధ్య విబేధాలు ఉన్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని దేవినేని అవినాష్ బోడె ప్రసాద్ వ్యతిరేక వర్గంతో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అవినాష్ పెనమలూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున్న కార్యక్రమాలు చేపట్టి అందరికీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. దేవినేని నెహ్రు వర్దంతి కార్యక్రమానికి బోడె ప్రసాద్ ను ఆహ్వానించినా ఆయన దేవినేని అవినాష్ వచ్చి వెళ్లిన తర్వాత ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు ఎంతదూరం వెళ్లాయో చాలా స్పష్టంగా అర్థమయ్యింది. కంకిపాడు, పెనమలూరులో అవినాష్ నిత్యం పర్యటిస్తూ అక్కడ ఏదో ఒక ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దేవినేని అవినాష్ పెనమలూరు నుంచి పోటీ చేయాలనే ఆలోచనతోనే ఈ విధంగా చేస్తున్నాడన్న చర్చ జరుగుతుంది.
దేవినేని అవినాష్ పెనమలూరు నియోజకవర్గమే కాదు… విజయవాడ తూర్పు నియోజకవర్గంపై కూడా ఓ కన్నేశారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వర్గీయులను ఆకర్షించే పనిలో దేవినేని అవినాష్ బిజీ అయ్యారు. గద్దె వ్యతిరేక వర్గంతో ఇప్పటికే దేవినేని అవినాష్ వర్గీయులు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఈ మధ్య దేవినేని అవినాష్ కీలక నేతలు, కార్యకర్తలతో చర్చించారు. దీనిపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశారు. అయినా లోకేష్ దీనిని అంతా సీరియస్ గా పట్టించుకోకుండా ఎటువంటి నిర్ణయం చెప్పలేదు. పెనమలూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ పోటీ చేసే ఆలోచనతో ఉన్నారని దేవినేని అవినాష్ సన్నిహితులు అంటున్నారు. దేవినేని అవినాష్ తీరు గద్దె రామ్మోహన్ కు, బోడె ప్రసాద్ లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే టీడీపీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి..అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో దేవినేని తన రాజకీయ దూకుడు పెంచారు. దేవినేని అవినాష్ దూకుడుతో విజయవాడ రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.