ఆ ప్రచారాన్ని మరిపించేందుకే!
యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం ప్రముఖంగా ట్రోలింగ్ కి గురైన పేరు సల్మాన్ ఖాన్. బీయింగ్ హ్యూమన్ పేరుతో సామాజిక సేవల మాటున చాలా అన్యాయాలు చేస్తున్నాడని దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ ఆరోపించడం కలకలం రేపింది. నటవారసుల్ని పరిచయం చేసే సల్మాన్ ఖాన్ బయటి ప్రతిభను తొక్కేశాడన్న ఆరోపణలు సంచలనమయ్యాయి. ప్రస్తుతం ఈ టాపిక్ దేశవ్యాప్తంగా వాడి వేడిగా చర్చకు వచ్చింది. సుశాంత్ సింగ్ అభిమానులు సోషల్ మీడియాల్లో తీవ్రంగానే ఆరోపించి హీట్ పెంచారు.
అయితే ఉన్నట్టుండి సల్మాన్ ఖాన్ సూపర్ హీరోగా నటించబోతున్నాడంటూ ఓ కొత్త ప్రచారం మొదలైంది. సల్మాన్ ని సూపర్ హీరోని చేస్తూ నాలుగు సినిమాల ఫ్రాంఛైజీని రన్ చేయబోతున్నానని సల్మాన్ స్నేహితుడు అయిన అలీ అబ్బాస్ జాఫర్ హైలైట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సల్మాన్ .. కత్రినలతో ఈ ఫ్రాంఛైజీని రన్ చేస్తానని అతడు వెల్లడించారు. కత్రిన సూపర్ గాళ్ పాత్రలో `మిస్టర్ ఇండియా`ను మొదటి ప్రయత్నంగా తెరకెక్కిస్తానని ప్రకటించిన జాఫర్.. అనీల్ కపూర్ మిస్టర్ ఇండియాతో పోలిక ఉండదని వెల్లడించడం ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఈ సినిమా నాలుగు సినిమాల్లో ఒకటిగా ఉంటుంది. భారత సైన్యం నుంచి ఒక సూపర్ హీరో… అలాగే పురాణేతిహాసాల నుంచి మరో సూపర్ హీరో పాత్రను ఎంపిక చేస్తానని వాటన్నిటి కలయికతో నాలుగు సినిమాలు కొనసాగింపుగా ఒకదాని వెంట ఒకటిగా రిలీజవుతాయని అలీ అబ్బాస్ జాఫర్ వెల్లడించారు.
అయితే ఉన్నట్టుండి సల్మాన్ సూపర్ హీరో!! అన్న టాపిక్ తెరపైకి తేవడం వెనక కారణమేమిటి? అభిమానుల్ని డైవర్ట్ చేసేందుకేనా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికీ సుశాంత్ సింగ్ అభిమానులు సల్మాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బాలీవుడ్ లో నెప్టోయిజాన్ని ఎంకరేజ్ చేస్తూ సుశాంత్ లాంటి ప్రతిభావంతుల్ని తొక్కేస్తున్నారని అందువల్ల ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని సల్మాన్ బోలెడన్ని కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు స్పందించని సల్మాన్ తాజాగా సుశాంత్ అభిమానుల ట్రోలింగ్ నుద్ధేశించి వ్యాఖ్యానించాడు. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన అభిమానులు బాధలో ఉన్నారు. వారిని వదిలేయండి.. ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అని సల్మాన్ తన అభిమానులను కోరారు. సుశాంత్ ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం ఆసక్తికరం.