రాష్ట్రంలో హిందీని నేర్చుకోవద్దని ఎవరూ చెప్ప లేదని, బలవంతంగా రుద్దవద్దని మాత్రమే అంటున్నారని నటుడు ’మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన హిందీ లాంగ్వేజ్‌పై జరుగుతున్న కాంట్రవర్సీపై మాట్లాడారు. నాకు కొంతమేర మాత్రమే హిందీలో మాట్లాడటం తెలుసు.
ఐదు హిందీ చిత్రాల్లో నటించా. తమిళనాడులో హిందీని నేర్చుకోవద్దని ఎవరూ చెప్పడం లేదు. బలవంతంగా రుద్దవద్దని మాత్రమే చెబుతున్నారు. ఇక్కడ అనేక మంది హిందీని అభ్యసిస్తున్నారు. వీరిపై ఎవరి ఒత్తిడి లేదు. ఈ విషయం గురించి మంత్రి పళనివేల్ త్యాగరాజన్ గతంలో వివరించారు. ఇక్కడ ఈ ప్రశ్న అసందర్భం.
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషా సరిహద్దులను అభిమానులు చూడటం లేదు. నా కుమారుడు సూర్య హీరోగా పరిచయమవుతూ నటిస్తున్న తొలి చిత్రం ’ఫీనిక్స్’. మా గురించి బయట చెప్పుకోవద్దని మేం నిర్ణయం తీసుకున్నాం. అందుకే నా కుమారుడి చిత్ర ప్రారంభోత్సవ పూజకు వెళ్లలేదని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటించిన ’మెర్రీ క్రిస్మస్’ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు.
టీను ఆనంద్, సంజయ్‌కపూర్, వినయ్ పాథక్, ప్రతిమా ఖన్నన్, రాధికా ఆప్టే, అశ్విన్ ఖల్సేకర్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. రమేష్ తారణి, సంజయ్ రౌత్రే, జయ తారణి, కెవల్ గార్గ్ నిర్మాతలు. ఈనెల 12వ తేదీన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.