షాక్: ఆగ‌స్టులో థియేట‌ర్లు తెరుస్తార‌ట‌

ఉన్న‌ట్టుండి షాకిచ్చే సంగ‌తే తెలిసిందే. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో మ‌హ‌మ్మారీ వైర‌స్ అంత‌కంత‌కు బెంబేలెత్తిస్తుంటే ఈ ఆగ‌స్టులో థియేట‌ర్లు తెరిచి జ‌నాల‌కు సినిమాలు చూపిస్తార‌ట‌. ఇది వినేందుకు వింత‌గానే ఉన్నా కానీ ప‌క్కా నిజం. అందుకు తెలుగు సినిమా నిర్మాత‌ల గిల్డ్ మార్గ‌ద‌ర్శ‌కాల్ని రూపొందిస్తుంద‌ని తెలిశాక‌.. హ‌త‌విధీ అంటూ చెవులు మూసుకోకుండా ఉండ‌గ‌ల‌మా?

కోవిడ్ 19 మార్గ‌ద‌ర్శకాల్ని పాటిస్తూ ఇక‌పై ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చు! అంటూ కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేయ‌నుంద‌ట‌. అన్ లాక్ 3.0 పేరుతో ఈ క్ర‌తువుకు తెర‌తీస్తున్నారు. థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చు.. జిమ్ములు తెరిచేయొచ్చు అనేది దీని కాన్సెప్ట్.

థియేట‌ర్లు తెరిచారు స‌రే.. ఏఏ సినిమాలు రిలీజ్ చేస్తారు?  అంటే దానికి స‌మాధానం టాలీవుడ్ నిర్మాత‌ల‌ గిల్డ్ వాళ్లే చెప్పాలి. ఇప్ప‌టికే దిల్ రాజు `వీ` మ‌ల్టీస్టార‌ర్ సినిమాని సిద్ధం చేసి వ‌దిలేందుకు రెడీగా ఉన్నారు. అనుష్క నిశ్శ‌బ్ధం రెడీ. ఈ రెండిటితో పాటు రానా అర‌ణ్య‌, వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన సినిమాల్ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నార‌ట‌. క్రాక్ – ల‌వ్ స్టోరి లాంటి సినిమాల్ని ద‌స‌రాకి రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ లో ఉన్నారు కాబ‌ట్టి ఇప్పుడే రావు.

మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ను ర‌న్ చేయాల్సి ఉంటుంది. పైగా షో అయిన ప్ర‌తిసారీ థియేట‌ర్ మొత్తం శానిటేష‌న్ చేయాల్సి ఉంటుంది. ఇక థియేట‌ర్ల‌లోకి జ్వ‌రం వ‌చ్చిన వారిని అనుమ‌తించ‌రు. తీరా థియేట‌ర్ లో క‌రోనా పాజిటివ్ కేసు ఏదైనా త‌గిలితే ఆ త‌ర్వాత ఆ థియేటర్ కొన్నాళ్లు మూసి వేయాల‌ని ఒక కొత్త రూల్. ఈ ఒక్క రూల్ చాల‌దూ? జ‌నం థియేట‌ర్ల‌కు రారు అన‌డానికి. ఇప్ప‌టికే మ‌హంకాళిలా తాట‌కిలా వైర‌స్ జ‌నాల నెత్తిన శివ‌తాండ‌వ‌మాడుతుంటే థియేట‌ర్లు తెరిచే ప్లాన్ చేస్తుండ‌డ‌మే వింత‌గా లేదూ?  అయినా త‌ప్ప‌దు.. మ‌నిషి ఆశాజీవి. ప్ర‌భుత్వాల‌కు ఇంత‌కంటే గ‌త్యంత‌రం లేదు మ‌రి.