గోదారి జిల్లాల్లో `సైరా` టాప్ క్లాస్ బిజినెస్
రామ్ చరణ్ నటించిన రంగస్థలం గోదారి జిల్లాల్లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. గోదారి యాసలో చిట్టిబాబు విన్యాసాలు ఆ రెండు జిల్లాల వాసులకు ఓ రేంజులో కనెక్టయ్యాయి. అందుకు తగ్గట్టే ఆ రెండు జిల్లాల నుంచి అత్యద్భుతమైన వసూళ్లను సాధించింది ఆ చిత్రం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న `సైరా: నరసింహారెడ్డి` చిత్రానికి గోదారి జిల్లాల్లో అద్భుతమైన బిజినెస్ జరుగుతుండడం ఆసక్తికరం. బాహుబలి, సాహో సినిమాలకు ధీటుగా గోదారి జిల్లాల్లో సైరా బిజినెస్ సాగిందని తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 19.6 కోట్లకు ప్రముఖ పంపిణీదారుడు చేజిక్కించుకున్నారని తెలుస్తోంది. ఈ జిల్లాల్లో ఇంత ధరకు ఇప్పటివరకూ ఏ సినిమా హక్కులు అమ్ముడవ్వలేదని సమాచారం. అంటే కేవలం గోదారి జిల్లాల నుంచి 20 కోట్ల మేర షేర్ ను సైరా వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక ఇటీవలే రిలీజైన ప్రభాస్ సాహో గోదారి జిల్లాల రైట్స్ ని 19 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే.
కేవలం గోదారి జిల్లాల్లోనే కాదు.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సైరా బిజినెస్ స్కైలో ఉందని ట్రేడ్ చెబుతోంది. ఇప్పటికే శాటిలైట్ రూపంలోనే 120 కోట్లు దక్కనుందని.. ఓవర్సీస్ 40కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా 150కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేస్తోందని తెలుస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజవుతోంది. నేడు వినాయక చవితి శుభాకాంక్షలతో సైరా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఉయ్యాలవాడ రాజసాన్ని ఆవిష్కరిస్తోంది ఈ పోస్టర్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.