ఆచార్య సినిమా కథ తనదే అంటూ ఓ దర్శకుడు బయల్దేరిన సంగతి తెలిసిందే. అలాగే మరోవైపు పుష్ప సినిమా కథ తనదంటూ ఇంకో రచయిత బయటకు వచ్చాడు. ఈ కాపీ లెక్కలు ఎప్పుడూ ఓ పట్టాన తేలివి కావు. ఎవరో ఒకరు ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు. కొన్ని సార్లు అందులో వాస్తవాలు కూడా ఉంటాయి. ఇంకొన్ని సార్లు కేవలం ఫేమస్ అవ్వడానికి మాత్రమే చేస్తుంటారు. ఆచార్య కథ కాపీ అంటూ వస్తోన్న వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది.
ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తోన్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ ఓ ప్రెస్ నోటో విడుదల చేసింది. అందులో ఏముందంటే.. ‘ఆచార్య స్టోరీ కొత్తది, దాన్ని కొరటాల శివ రూపొందించాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. బయట వినిపిస్తున్న వార్తల ప్రకారం అది కాపీ స్టోరీ కాదు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన మోస్టర్ పోస్టర్ విపరీతమైన ఆదరణను దక్కించుకుంది. అప్పటి నుంచి ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి. అలా మోషన్ పోస్టర్ వైరల్ కావడంతో కొంతమంది రచయితలు ఇది తమ స్టోరీ అని చెప్పుకుంటున్నారు.
ఆచార్య కథను మేము ఎంతో గుప్తంగా ఉంచాము. కేవలం కొద్ది మందికి మాత్రమే పూర్తి కథ తెలుసు. మోషన్ పోస్టర్‌ను ఆదారంగా చేసుకుని ఈ కథ కాపీ అని చెప్పడం మరీ నవ్వులాటగా ఉంది. అవన్నీ అవాస్తవాలే. కొరటాల శివ లాంటి పేరున్న దర్శకుడిపై బురద జల్లడం భావ్యం కాదు. అయినా ఈ వార్తలన్నీ ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ సైట్లలోనే వస్తున్నాయి. అందుకే మరోసారి మేము క్లారిటీ ఇస్తున్నాం. ఆచార్య కథ కాపీ అంటూ వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలే ’అంటూ కాస్త గట్టిగానే చెప్పుకొచ్చింది.