ఆచార్య వెనుక అంత కథ ఉందా?.. మొత్తానికి అలా సెట్ చేసేశారన్నమాట!!

 

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకు ఎన్ని అడ్డంకులు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. సైరా ఎఫెక్ట్ అంతా కూడా ఆచార్య మీద పడింది. దాదాపు ఓ ఏడాది పాటు ఆచార్య వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అన్ని అడ్డంకులను దాటుకుని సినిమా మొదలుపెడితే ఏవేవో కారణాలతో మధ్యలో వాయిదాలు పడింది. అలాంటి ఆచార్య మీద కరోనా వంటి పిడుగు పడింది. లాక్టౌన్ మూలాన ఆచార్య మొత్తానికి వెనక్కిపోయింది.

Chiranjeevi Acharya satellite rights,Acharya,

ఇవి చాలదన్నట్టు ఆచార్య, కొరటాల శివ మీద కాపీ మరకలు. ఆ మధ్య ఓ నెల పాటు ఆచార్య వార్తల్లో నానింది. ఓ యువ రచయిత ఆ కథ తనదేనంటూ మీడియా ముందు వాపోయాడు. కొన్ని రోజులకు ఆ వార్తలు కూడా మాయమైపోయాయి. మొత్తానికి ఆచార్య మాత్రం వచ్చే వారం నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. తాజాగా ఆచార్య గురించి ఓ అప్డేట్ వచ్చింది. ఆచార్య శాటిలైట్ హక్కులు అమ్ముడైనట్టు సమాచారం.‌

Chiranjeevi Acharya satellite rights,Acharya,

దీని వెనుకా పెద్ద కథే ఉందట. నిజానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ముందు నుంచి జెమినీ ఛానెల్‌కే అనుకున్నారట. దీని వెనక ఓ కారణం ఉంది. చిరంజీవి సైరా శాటిలైట్ విషయంలో చిన్నపాటి గందరగోళం తలెత్తిందిట. అప్పట్లో మేకర్స్ చెప్పిన భారీ రేటు చూసి ఛానెళ్లన్నీ వెనక్కితగ్గాయి. ఓవైపు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నప్పటికీ, చిరంజీవి సినిమాకు ఇంకా శాటిలైట్ పూర్తవ్వకపోవడం ఏంటనే నెగెటివ్ కామెంట్స్ జోరుగా వినిపించడంతో ఆఖరి నిమిషంలో జెమినీ ఛానెల్ ను రంగంలోకి దించి డీల్ క్లోజ్ చేశారు. అప్పటి లెక్కల్లో సర్దుబాట్లు చేసే క్రమంలో, ఆచార్య మూవీని కూడా జెమినీ ఛానెల్‌కే అప్పగించాల్సి వచ్చింది. సైరా కోసం ఆచార్యను కాస్త తక్కువ రేటుకే ఇచ్చినట్టు సమాచారం. కానీ ఎంతకు అమ్ముడుపోయిందన్న విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు.