హైదరాబాద్ లో కరోనా విలయతాండవమాడుతోంది. టీవీ సీరియల్ ఆర్టిస్టులు.. యాంకర్లు సహా వరుసగా సినీ సెలబ్రిటీలకు కరోనా మహమ్మారీ సోకిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకపోయినా ఏదో ఒక రోజు ఈ వార్త వినాల్సి వస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ సహా ఆయన కుటుంబీకులకు కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చేరాక ఇటు టాలీవుడ్ ప్రముఖులంతా దేవుళ్లకు మొక్కారు.
పాజిటివ్ కేసుల్లో సెలబ్రిటీల జాబితా అంతకంతకు పెరుగుతోంది. ఇటీవల ఎస్.ఎస్.రాజమౌళి సహా ఆయన కుటుంబీకులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అభిమానులు ఆందోళన చెందారు. స్వల్ప లక్షణాలు బయటపడడంతో దానికి చికిత్స పొందారు. టాలీవుడ్ ప్రముఖుల్లో గానగంధర్వుడు ఎస్.పి.బి కి కరోనా పాజిటివ్ అని తాజాగా రివీలైంది.
విజయవాడ గాయని పాప్ స్మితకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. అలాగే ఎస్వీబీసీ చానెల్ మాజీ ఛైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ కి తాజాగా కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చికిత్స జరుగుతున్న వీడియోలు తెలుగు మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం (టీఎంటీఏయు) వాట్సాప్ గ్రూపుల్లో రివీలైంది. టీఎంటీఏయు అధ్యక్షుడు పృథ్వీ త్వరగా కోలుకోవాలని ఆర్టిస్టులు ఆకాంక్షించారు.
ఇక ఇటీవలే ఏబీఎన్ వార్తా చానెల్ లో పని చేస్తున్న ఓ సినిమా వింగ్ కెమెరామేన్ కరోనాకి చికిత్స పొంది ఆరోగ్యవంతులవ్వడంతో టాలీవుడ్ సినీజర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్ట్ కి శ్వాస ఆడని స్థితిలో గాంధీ ఆస్పత్రి వర్గాలు డిలే రెస్పాన్స్ పై నేరుగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కి టీ.ఎఫ్.జే.ఏ ద్వారా ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎంవో సహా కేసీఆర్ – కేటీఆర్- చిరంజీవి వంటి వారికి సోషల్ మీడియాల ద్వారా ఈ సంగతిని తెలియజేశారు. వెంటనే సదరు కెమెరామేన్ కి సపర్యలు చేసేందుకు మంత్రులు గాంధీ ఆస్పత్రి వర్గాల్ని ఆదేశించడంతో సకాలంలో చికిత్స అందింది.