సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో `పోకిరి` ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. టాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసిన చిత్రమిది. మహేష్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఈ సినిమాతోనే మహేష్ లో సూపర్ స్టార్ రేంజు కనిపించింది. పోకిరిలో అండర్ కవర్ ఆపరేషన్ చేసే ఐపీఎస్ అధికారి కృష్ణ మనోహర్ గా మహేష్ నటన ఆల్ టైమ్ హాట్ టాపిక్. ఆ పాత్రలో వేగం, స్పార్క్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆ తర్వాత మహేష్ కెరీర్ లో `దూకుడు` చిత్రానికి అంతే ప్రత్యేకత ఉంది.
ఈ సినిమాలోనూ మహేష్ సీరియస్ కాప్ గా కనిపించినా రొమాంటిక్ యాంగిల్ తో మైమరిపిస్తాడు. తెర నిండా బోలెడంత ఫన్ ని కూడా జనరేట్ చేశారు మహేష్. సూపర్ స్టార్ స్టామినాకి తగ్గ కథలతో పూరి, శ్రీనువైట్ల సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు అందుకున్నారు.
ఇప్పుడు అదే ఫార్ములాని `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి అనీల్ రావిపూడి అప్లయ్ చేస్తున్నారట. ఒక రకంగా “పోకిరి + దూకుడు= సరిలేరు నీకెవ్వరు“ అంటూ ఈక్వేషన్ చెబుతున్నారు. ఆ రెండు సినిమాల స్క్రీన్ ప్లే ఎంత వేగంగా పరిగెడుతుందో అంతే వేగంగా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఉంటుందట. ఒక సీన్ వెంట ఇంకో సీన్ అలా అలా పరిగెడుతుంటే ప్రేక్షకులు కళ్లు తిప్పకుండా మైమరచి చూస్తుంటారు. ప్రతి సన్నివేశంలో అంతే ఉత్సుకత ఉంటుంది. గమ్మత్తయిన హాస్యం పండేలా వర్కవుట్ చేస్తున్నారట. ఆ రెండు సినిమాల్లో మహేష్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. మాఫియాని ఎదుర్కొనే సిన్సియర్ అధికారిగా నటించి మెప్పించారు. ఈసారి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నారు. ఈ పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటూనే ఫన్ ని
జనరేట్ చేస్తుందట.
ముఖ్యంగా కశ్మీర్ నుంచి హైదరాబాద్ కి వచ్చే రైలు సన్నివేశంలో మహేష్ నటన అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. రైలులో జర్నీ ఎపిసోడ్ 20 నిమిషాల పాటు రక్తి కట్టిస్తుందట. ఈ సన్నివేశాల్లో ప్రధాన తారాగణం షూటింగులో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రైల్లో ఎపిసోడ్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు.
దర్శకుడు అనీల్ రావిపూడి ఇదివరకూ `దూకుడు` చిత్రానికి రచయితగా పని చేశారు. ఆ అనుభవం ఇప్పుడు మహేష్ తో సీన్స్ వర్కవుట్ చేయడానికి ఉపయోగపడుతోందట. మహేష్ పాత్రలో జోష్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. దాంతో పాటే స్క్రీన్ ప్లే లో స్పీడ్ పైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూపొందించారట. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన కథానాయిక. వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజుతో కలిసి ఏటీవీ అధినేత అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.