ఐమ్యాక్స్ సీక్రెట్స్ చెప్పాడు
ప్రభాస్ సాహో ట్రైలర్ వచ్చింది. అభిమానులకు పండగ తెచ్చింది. ఆగస్టు 30 రిలీజ్ సందర్భంగా సాహో సంబరాలు చాలా ముందే మొదలైనట్టే. బాహుబలి తర్వాత మరో విజువల్ ఫెస్ట్ ని ప్రభాస్ సిద్ధం చేస్తున్నారు ఫ్యాన్స్ కి. ఈసారి కూడా భారీ లెవల్లో ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని నెవ్వర్ బిఫోర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని అందిస్తున్నాడు. సుజీత్ హార్డ్ వర్క్.. యు.వి.క్రియేషన్స్ రాజీలేని పెట్టుబడులు తెరపై కనిపించబోతున్నాయని ట్రైలర్ చెబుతోంది.
అంతేకాదు ఈ యాక్షన్ సినిమాకి వేరొక ప్రత్యేకత ఉందని నేడు ముంబైలో జరిగిన ట్రైలర్ ఈవెంట్ లో దర్శకుడు సుజీత్ వెల్లడించారు. ఈ సినిమా కోసం ఉపయోగించిన సాంకేతికత ఇండియన్ స్క్రీన్ కి ఎంతో ప్రత్యేకం .. పూర్తిగా అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐమ్యాక్స్ కెమెరాలతో తెరకెక్కించాం. యాక్షన్ సన్నివేశాలు ఐమ్యాక్స్ ఫార్మాట్ లో మైమరిపిస్తాయి. అందుకోసం ఎక్కడా రాజీకి రాకుండా భారీగా బడ్జెట్ ని నిర్మాణ సంస్థ కేటాయించింది.. అని సుజీత్ వెల్లడించారు. ఐమ్యాక్స్ తెర కోసం చాలా సినిమాల్ని డిజిటల్ లో మాస్టరింగ్ చేస్తుంటారు. కానీ సాహోని మాత్రం ఐమ్యాక్స్ కెమెరాల్లోనే చిత్రీకరించామని సుజీత్ చెప్పడం ఆసక్తిని పెంచుతోంది. హాలీవుడ్ సినిమాల తరహాలోనే ఐమ్యాక్స్ తెరపై సాహో వీక్షణ ప్రత్యేక అనుభూతినిస్తుందని తెలిపారు. ఈ సినిమా కోసం రేయింబవళ్లు చిత్రయూనిట్ శ్రమించిందని ఆ పనితనం తెరపై కనిపిస్తుందని అన్నారు. మరో 20 రోజుల్లో సాహో ట్రీట్ కోసం ఫ్యాన్స్ రెడీగా ఉండాలని టీమ్ కోరింది.