`సాహో` త‌ప్పిదాల వెన‌క‌ ఎవ‌రికీ తెలీని ర‌హ‌స్యాలు

గురువునే లెక్కచేయ‌ని ప్ర‌భాస్‌

బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాహుబ‌లి సిరీస్ చిత్రాల త‌రువాత ప్ర‌భాస్ నుంచి సినిమా వ‌స్తోందంటే దేశ వ్యాప్తంగా ఆస‌క్తి మొద‌లైంది. అయితే బాహుబ‌లి లాంటి సినిమా త‌రువాత యాక్ష‌న్ చిత్రాల్లో న‌టించొద్ద‌ని, రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ లు మాత్ర‌మే ట్రై చేయమ‌ని హీరో ప్ర‌భాస్‌కు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. బాహుబ‌లి యాక్ష‌న్ త‌ర‌హా చిత్రం. దాని త‌రువాత మ‌ళ్లీ యాక్ష‌న్ సినిమా అంటే ప్రేక్ష‌కులు భారీ స్థాయిలో ఆశిస్తారు. ఆ స్థాయిలో వారిని సంతృప్తి ప‌ర‌చ‌క‌పోతే సినిమా ఆడ‌దు. ఆక‌ట్టుకోదని త‌న విశ్లేష‌ణ‌ను చెప్పాడ‌ట‌.

కానీ `బాహుబ‌లి`తో ప్ర‌భాస్‌కు వ‌చ్చిన క్రేజ్‌ని ఎన్ క్యాష్ చేసుకునేందుకే యువీ క్రియేష‌న్స్ ప్లాన్ ని డిజైన్ చేసింది. అందుకు త‌గ్గ‌ట్టే భారీ యాక్ష‌న్ చిత్రానికి తెర తీశారు. కేవ‌లం 150 కోట్ల బ‌డ్జెట్ తో `సాహో`ని ప్రేమ‌క‌థా చిత్రంగా తీయాల‌నుకున్నారు తొలుత‌. కానీ అది కాస్తా ఊహించ‌ని విధంగా యాక్ష‌న్ ల‌వ్ స్టోరీగా మారింది. కాన్వాసు అంత‌కంత‌కు పెరిగి.. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌గా `సాహో`ని తెర‌పైకి తీసుకొచ్చారు. ఇందులో స్పై డామినేష‌న్ దాంతో పాటే యాక్ష‌న్ డామినేష‌న్ పెర‌గ‌డంతో ల‌వ్ స్టోరి కాస్తా మున‌గ‌చెట్టెక్కేసింది. వాస్త‌వానికి సాహో చిత్రాన్ని ప్రేమ‌క‌థా చిత్రంగా తీయాల్సింది. కానీ సుజీత్ కి ఎప్ప‌టిక‌ప్పుడు టాస్క్ మారిపోవ‌డంతో అలా అలా అది రూట్ మార్చేసుకుందని తెలుస్తోంది.

ధీరుడినే లెక్క‌చేయ‌ని యువీ టీమ్‌!

ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో సాహో నిడివి కూడా చాంతాడంత సాగింది. యాక్ష‌న్ సినిమా నిడివి భారీగా వుంటే ప్రేక్ష‌కులకు న‌చ్చ‌దు. అదో టార్చ‌ర్‌లా భావిస్తారు. ఈ విష‌యం గ్ర‌హించిన రాజ‌మౌళి సాహో స్పెష‌ల్ షో చూసిన వెంట‌నే ర‌న్ టైమ్ త‌గ్గించాల‌ని సూచించాడ‌ట‌. కానీ యువి మేక‌ర్స్, ప్ర‌భాస్ సైతం అస‌లు రాజ‌మౌళి స‌ల‌హాని ప‌ట్టించుకోకుండా య‌దావిధిగా అనుకున్న ర‌న్‌టైమ్‌తో సినిమాని విడుద‌ల చేశారు. తొలి రోజున‌ డివైడ్ టాక్ తెచ్చుకోవ‌డంతో రాజ‌మౌళి సాహో టీమ్‌తో అన్న మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సాహో దాదాపు 350 కోట్ల గ్రాస్ .. 200కోట్ల షేర్ వ‌సూలు చేసినా ఇంకో 100 కోట్లు తేలేక‌పోతే ఆ మేర‌కు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు చుక్క‌లు క‌న‌బ‌డిన‌ట్టేన‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌.