కష్ట కాలంలో పారితోషికాలు పెంచిన అగ్రనిర్మాత
ఓవైపు కోవిడ్ విలయం టాలీవుడ్ ని అల్లకల్లోలం చేసింది. ఉపాధి కరువై అంతా గందరగోళంలో పడిపోయారు. వ్యాక్సిన్ రాదు.. టీకా రాదు! ఇంకెప్పుడు షూటింగులకు వెళ్లేది? అన్న ఆందోళన నెలకొంది. ఆశావహ ధృక్పథంతో కొందరు ఈ సన్నివేశం నుంచి బయటపడి తిరిగి యథావిధి స్థితికి పరిశ్రమ రావాలని కోరుకుంటున్నారు. థియేటర్లు తెరవక ఓటీటీ/ డిజిటల్ పుంజుకుంటున్న వైనం చూస్తున్నదే.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ముందు పరిశ్రమలో పారితోషికాలు తగ్గించాలి! అన్న డిమాండ్ నెలకొంది. అగ్ర హీరోలు హీరోయిన్లు సహా టాప్ డైరెక్టర్లు టెక్నీషియన్ల పారితోషికాలు అమాంతం తగ్గితేనే సినిమా బడ్జెట్ల భారం నిర్మాతలు మోయగలరు అన్న చర్చ సాగుతోంది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ పారితోషికాలు పెంచడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
చాలా మంది బడా నిర్మాతలు తమ ప్రస్తుత ప్రాజెక్టుల విషయంలో పెద్ద స్టార్ల కు పారితోషికాల్ని తగ్గించి బడ్జెట్‌ను తగ్గించుకుంటున్నారు. కానీ దత్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వెళుతున్నారనేది ఇన్ సైడ్ గుసగుస. ప్రభాస్ 21 విషయంలో దత్ ఏమాత్రం తగ్గడం లేదు. కాస్టింగ్ సహా టెక్నీషియన్లకు భారీ పారితోషికాలు ముట్టజెప్పనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హీరో హీరోయిన్ తో బిగ్ డీల్ కుదుర్చుకున్నారు.
డార్లింగ్ ప్రభాస్ ఈ మూవీ కోసం ఏకంగా రూ.30 కోట్ల పారితోషికం దాంతో పాటే హిందీ రైట్స్ కానీ ఏరియా హక్కులు కానీ ముట్టజెప్పనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేనా .. ప్రభాస్ సరసన నటిస్తున్న దీపికా పదుకొనేకు 22 కోట్ల రూపాయల వేతనం చెల్లించడానికి అంగీకరించారట. అలా ఈ ఇద్దరి కోసం కేటాయించేదే 50కోట్లు దాటింది. ఈ గుసగుసలతో సీనియర్ నిర్మాత అశ్విని దత్ బడ్జెట్‌ను తగ్గించడం లేదనే అర్థమవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాకు అవసరమైన అన్ని సదుపాయాల్ని దత్ అందిస్తున్నారట. ఈ మూవీ మరో బాహుబలి 2 రేంజు అంటూ ప్రచారం సాగిపోతోంది.
స్క్రిప్టు బలంతో భారీ చిత్రాల్ని నిర్మించే అగ్ర నిర్మాతగా అశ్విని దత్ కి పేరుంది. కరోనావైరస్ కల్లోలంలోనూ ఆయన ఎక్కడా తగ్గడం లేదు. మారిన ప్రస్తుత సన్నివేశంలోనూ ఆయన బడ్జెట్ల పరంగా తగ్గడం లేదనేది ఇన్ సైడ్ గుసగుస. ఒక రకంగా ప్రభాస్ 21వ చిత్రంపై బిగ్ బెట్టింగ్ చేస్తున్నారని భావిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీ ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. 2022 విడుదలవుతుంది. దాదాపు ఐదు భాషలలో విడుదల అవుతుందని తెలుస్తోంది.