సైరా ఈవెంట్ వ‌ర్షార్ప‌ణం.. మెగా ఫ్యాన్స్ నిరాశ‌

అదంతా ఉయ్యాల‌వాడ దీవెన‌

దాదాపు 270 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా `సైరా: న‌ర‌సింహారెడ్డి` అంటూ ప్ర‌చారం సాగుతోంది.  అందుకు త‌గ్గ‌ట్టే హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక‌ను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం సాయంత్రం వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రిగింది.

అయితే స‌రిగ్గా ఈవెంట్ మొద‌ల‌య్యే ముందు హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో అది కాస్తా సైరా టీమ్ ని టెన్ష‌న్ కి గురి చేసింది. ల‌క్ష‌ల్లో దార‌పోసి భారీ వేదిక‌ని నిర్మించారు. స్టేడియం వెలుప‌ల స్టేజ్ ని అత్యంత భారీగా నిర్మించారు. మొన్న రామోజీ ఫిలింసిటీలో సాహో కోసం ఏ స్థాయి వేదిక‌ను రెడీ చేశారో అంతే పెద్ద‌గా వేదిక‌ను నిర్మించి భారీగా కార్య‌క్ర‌మాల్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లాన్ మొత్తాన్ని వ‌రుణుడు అడ్డ‌గోలుగా చెడ‌గొట్టేయ‌డం క‌ల‌త‌కు గురి చేసింది.

ఈవెంట్ మొద‌ల‌వ్వ‌డానికి స‌రిగ్గా అర్థ‌గంట ముందు హైద‌రాబాద్ లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. వేదిక వ‌ద్ద మ‌రీ అంత ర‌చ్చ‌వ్వ‌క‌పోయినా.. ఆ వ‌ర్షం అక్క‌డ లేక‌పోవ‌డంతో హ‌మ్మ‌య్య అంటూ కొంత ఊపిరి పీల్చుకున్నార‌ట‌. అయినా వ‌రుణుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఇక అతిధుల స్పీచ్ లు ప్రారంభం అవుతాయి అన‌గానే మ‌రోసారి చినుకులు మొద‌ల‌య్యే స‌రికి ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితిలో ఈవెంట్ ని చ‌క‌చ‌కా ముగించేశారు. అతిధులంతా షార్ట్ అండ్ స్వీట్ గా స్పీచ్ లు ఇచ్చి ముగించేయ‌డంతో ఈవెంట్ జరిగిందా లేదా అన్న‌ట్టుగా క‌నిపించింది. మొత్తానికి అంత భారీ ప్లానింగ్ చేస్తే వ‌రుణుడు అన‌వ‌స‌రంగా చెడ‌గొట్టాడు. ఇంత‌కుముందు క‌ర్నూలులో భారీ ఈవెంట్ అనుకుంటే ఇలానే అక్క‌డా వ‌రుణుడు వెంటాడాడు. అక్క‌డ ఏకంగా వ‌ర‌ద‌లే వ‌చ్చాయి. ఇప్పుడు హైద‌రాబాద్ లో ఈ సీజ‌న్ కే బెస్ట్ వ‌ర్షం కురిసింది. దీంతో ఉయ్యాల‌వాడ దీవెన‌లు సైరాకు పుష్క‌లంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సైతం ఉయ్యాల‌వాడ నేరుగా ఆకాశం నుంచి అక్షింత‌లు వేశారు చిత్ర‌యూనిట్ పై అంటూ సైలెంట్ పంచ్ వేశారు.

మొత్తానికి వ‌రుణుడి వ‌ల్ల కొణిదెల టీమ్ బాగా డిస్ట్ర‌బ్ అయిపోవ‌డం క‌నిపించింది. అక్టోబ‌ర్ 2న రిలీజ్ కాబ‌ట్టి అప్ప‌టికి వ‌రుణుడు శాంతించి జ‌నాల్ని థియేట‌ర్ల కు వెళ్లేనిస్తే ఫ‌ర్వాలేదు. ఇలానే భారీ వ‌ర్షాల‌తో న‌గ‌రాలు అత‌లాకుత‌లం అయితే మాత్రం ఆ మేర‌కు బుకింగ్ ల‌పైనా పంచ్ ప‌డుతుంది. కొంప‌దీసి వార‌సుల‌కు 40కోట్లు ఇవ్వ‌లేద‌ని చ‌ర‌ణ్ పై ఉయ్యాల‌వాడ క‌క్ష క‌ట్టాడో ఏమిటో!