చరణ్ నటించడు అనేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా- నరసింహారెడ్డి` పాజిటివ్ టాక్ నడుమ సక్సెస్ఆ ఆనందం కొణిదెల కాంపౌండ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. నేడు హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఉద్వేగంగా కనిపించారు. 150 సినిమాలు ఒక ఎత్తు అనుకుంటే 151వ సినిమా ఇంకో ఎత్తు! అంటూ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు చిరంజీవి. భగత్ సింగ్ జీవితకథలో నటించాలని అనుకుంటే ఉయ్యాలవాడ కథ విన్నానని చివరికి నేటి సాంకేతికత.. పెద్ద స్థాయి బడ్జెట్ తోనే ఇది సాధ్యమైందని అన్నారు.
మీ బయోపిక్ తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి కదా? చిరంజీవిగా ఎవరు నటిస్తే బావుంటుంది? అన్న ప్రశ్నకు చిరు ఆసక్తికరంగా స్పందించారు. నా బయోపిక్ లో చరణ్ ని నటించవద్దనే చెబుతాను. ఎందుకంటే తను పుట్టినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకునే సన్నివేశంలో చరణ్ కనిపించడం బావుండదు అని అన్నారు. తన కుటుంబంలోని హీరోలే నటించాలని కోరుకుంటున్నానని.. సాయిధరమ్.. వరుణ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ వీళ్ల పోలికను చూస్తే.. నా యుక్తవయసులో ఉన్నప్పటి పోలికలు కనిపిస్తాయని చిరంజీవి అన్నారు. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు నటిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. చిరు బయోపిక్ లో నటించే అవకాశం వస్తే మేం సిద్ధమేనని ఇప్పటికే పలువురు మెగా హీరోలు ఆసక్తిని కనబరిచారు. మరి ఆ జాక్ పాట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.