మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా నరసింహారెడ్డి` బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఉత్తరాదిన ఆశించిన ఫలితం దక్కకపోయినా .. తెలుగు రాష్ట్రాల్లో `సైరా` థియేటర్లన్నీ 60శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కర్ణాటకలోనూ స్పీడ్ కొసాగిస్తోంది. హిందీ, తమిళ్ లో కాస్త తడబడినా ఆ మార్కెట్ చిరుకు అంత కీలకం కాదన్న విశ్లేషణ కొణిదెల కాంపౌండ్ నుంచి లీకైంది. ఓవర్సీస్ ఫలితాలే కాస్త ఆశాజనకంగా లేవు. అయినా సైరాకి వచ్చిన నష్టం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. `ఉయ్యాల వాడ` చరిత్రను అద్భుతంగా కళ్లకు కట్టిన నటుడిగా చిరు టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతారు. స్వాతంత్య్ర సమరయోధుల బయోపిక్ ల గురించి చెప్పుకోవాలంటే సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ తర్వాత చిరు పేరునే చెప్పుకునేలా టాలీవుడ్ చరిత్ర పుసక్తంలోకి ఎక్కారు. 12 ఏళ్ల కలను సాకారం చేసుకున్న ఆనందం చిరులో కనిపిస్తోంది.
తాజాగా ఈ సినిమాను ఇండియన్ ఆర్మీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శరిస్తున్నారు. బెంగుళూరు సిటీలో దాదాపు 60 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. చోప్రా ఆడిటోరియం, హెచ్ క్యూ ట్రెయినింగ్ కమాండ్, కృష్ణా ఎయిర్ ఫోర్స్ – జలహళ్లి, శివ్ దత్తా క్యాంప్ సెంటర్, ఆర్ఎస్ఐ మూవీ మోక్షా, పారాష్యూట్ రెజిమెంటల్ సెంటర్, ఎయిర్ ఫోర్స్ ఎలహంక, వైజీ హాల్ బెల్గావి, ఎమ్ఈజీ సెంటర్ లలో భారత ఆర్మీ కోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన వేస్తున్నారు. ఈ చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేసిన ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్మీ యువతరం జవాన్లలో మరింత స్ఫూర్తిని రగిలించే కథాంశం ఇది అన్న నమ్మకంతోనే ఇలా ప్రత్యేకించి షోని ఏర్పాటు చేస్తున్నారట.