అక్కినేని జీవిత సత్యాలు

అక్కినేని నాగేశ్వర రావు చదువుకోలేదు . పల్లెటూరివాడు . నమస్కారం చేసే సంస్కారం కూడా లేదు . సిన్నిత మనస్కుడే కానీ ఆత్మ న్యూనత భావం . అయితే అందివచ్చిన అవకాశాలను సద్వియోగం చేసుకున్నాడు . విమర్శలను హుందాగా స్వీకరించాడు . ఆటుపోట్లను తట్టుకున్నాడు , అవమానాలను భరించాడు , అవహేళనలు దిగమింగాడు . తానూ తప్పు చేయనంత కాలం ఎవరికీ భయపడనవసరం లేదనుకున్నాడు . తన లక్ష్యాన్ని మర్చిపోలేదు . గమ్యాన్ని వదిలి పెట్టలేదు . అక్కినేని జీవితం వడ్డించిన విస్తరి కాదు .
గురువారం నాడు ఆయన 95వ జయంతి సందర్భంగా ఆయన ఆలోచనలను ఈ క్రింద ఇస్తున్నాము .
“కాలం ,కలికాలం అనుకుంటాం అప్పుడప్పుడు
తోకలులేని కోతిమూకల కాలం అనుకోవాలి ఇప్పుడిప్పుడు “
“మంచి చెప్పేవాడిని మార్గదర్శి అనుకునే వాడొకప్పుడు మానవుడు
చెడును భోదించేవాడిని స్నేహితుడు అనుకుంటున్నాడిప్పుడు “
“నలుగురు ఎదో అన్నారని నూతిలో పడబోకు
నూతిలో పడి నీలాపనిందను నిజం చేయకు”
“నిజం చాటడానికి బ్రతక ప్రయత్నించకు
నిజాయితీగా బ్రతకటానికి నిజంగా ప్రయత్నించు “
“త్యాగబుద్ధితో దేశానికి సేవచేసే వాడొకప్పుడు
బుద్ధినే త్యాగం చేసి దేశాన్ని దోచుకుంటున్నారు ఇప్పుడు “
“జీవితంలో నటన వృత్తిగా తీసుకునే వాడొకప్పుడు మానవుడు
నటనే జీవితంగా జీవిస్తున్నాడు ఇప్పుడు “
“చచ్చి సాధించే దేముందని కనుక చావడానికి
పుట్టుక పరమార్ధం తెలుసుకుంటేనే నిజమైన బ్రతుకు “
“మనిషి మట్టిలో కలిసినా
చేసిన మంచి మాత్రం మిగులుతుంది
మంచి మరుగున పడిపోయినా
మనిషి మనస్సులో మెదులుతూనే ఉంటుంది “
“విమర్శించేవాడు చెప్పింది చేదు గుళికలు
తినిపించినట్టు ఉంటుంది
పొగిడేవాడు చెప్పింది చిలకలు
తినిపించినట్టు ఉంటుంది “
“పొగడ్త తీపిలాటిది కొవ్వేక్కిస్తుంది
విమర్శ చేదులాంటిది అభివృద్ధికి దోహదం చేస్తుంది “
“కళ్ళతో చూసేవన్నీ సత్యాలు కావు
చెవులతో వినేవన్నీ నిజాలు కావు
నిజాల వెనుక అబద్దాలు
అబద్ద;ల వెనుక సత్యాలు ఎన్నో ఎన్నెనో !”
“నిప్పు నీటితో చల్లారిపోవచ్చు
నిజం నిప్పులో కలసిపోవచ్చు
నిప్పులాంటి నిజం నిజంలాంటి నిప్పు
గుండెల్ని దహించివేస్తూనే ఉంటుంది “
“బ్రతికి బావుకునేది లేదని చావబోకు
చచ్చి సాధించేది లేదని బ్రతకబోకు
బ్రతికి జీవితాన్ని సాధించు
చనిపోయి కలకాలం జీవించు .
తన స్వానుభానువాలనే కవితలుగా చెప్పాడు అక్కినేని. ఇవి 1969 సంవత్సరానికి ముందు తన డైరీ లో రాసుకున్నారు . వాటినే అక్కినేని” అ ఆ లుగా ” ప్రచురించారు . అక్కినేనితో ఓ మహానటుడే కాదు మంచి కవి కూడా వున్నాడు కదూ ?