రౌడీ త‌ర్వాత‌ మ‌హేష్‌తో పూరి పాన్ ఇండియా

`జ‌న‌గ‌న‌మ‌న` పాన్ ఇండియా ప్లాన్స్

ప్ర‌స్తుతం పాన్ ఇండియా పిచ్చి పీక్స్ కు చేరుకుంది. ఏ ద‌ర్శ‌కుడిని క‌దిపినా పాన్ ఇండియా ప్లాన్ అనేస్తున్నారు. పాన్ ఇండియా బ‌ట్జెట్లు అంటే ఆషామాషీ కానే కాదు. కానీ ఆ పాట మాత్రం వ‌దిలి పెట్ట‌డం లేదు. అదృష్ట‌మో దుర‌దృష్ట‌మో కానీ ప్ర‌స్తుత క‌రోనా క‌ష్ట కాలంలో పూరి అన‌వ‌స‌రంగా ఫైట‌ర్ చిత్రాన్ని మొద‌లు పెట్టాడు. అది కూడా క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి పాన్ ఇండియా రేంజు! అంటూ హ‌డావుడి చేస్తున్నాడు. ఉన్న‌ట్టుండి మ‌హ‌మ్మారీ వ‌ల్ల బ్రేకులు ప‌డిపోయాయి. అయినా పూరీని పాన్ ఇండియా పిచ్చి వ‌దిలిన‌ట్టు లేదు.

ఇంత స్ట్ర‌గుల్ లోనూ ఉన్న‌ట్టుండి స‌డెన్ గా పూరి మ‌రో పాన్ ఇండియా మూవీ కోసం ఇప్ప‌టినుంచే స‌న్నాహ‌కాల్లో ఉన్నాడ‌ని ప్ర‌చారం అవుతోంది. పూరీనే ఆ సంగ‌తిని సోష‌ల్ మీడియాల్లోనూ చెప్పాడు. జ‌న‌గ‌న‌మ‌న నా డ్రీమ్ ప్రాజెక్ట్. త్వ‌ర‌లోనే సెట్స్ కెళ‌తాను. అది కూడా పాన్ ఇండియా స్క్రిప్టునే అంటూ అత‌డు చెప్ప‌డంతో ప్ర‌స్తుతం ఇస్మార్ట్ ఫ్యాన్స్ లో ఒక‌టే టెన్ష‌న్ అలుముకుంది.

ఇంత‌కీ జ‌న‌గ‌న‌మ‌న హీరో ఎవ‌రు? అంటే మ‌హేష్ కే ఆ అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొన్న‌టికి మొన్న న‌మ్ర‌త స్వ‌యంగా పూరిని క‌లిసి స్క్రిప్టును రెడీ చేయ‌మ‌ని చెప్పారు. దీంతో మ‌రోసారి జ‌న‌గ‌న‌మ‌న పాఠ‌మే పాడుతున్నాడు అందుకేనేమో! ఒక‌వేళ మ‌హేష్ కాద‌ని అన్నా త‌న డ్రీమ్ ప్రాజెక్టును ఫైట‌ర్ హీరో విజ‌య్ దేవర‌కొండ‌తో ప‌ట్టాలెక్కించే వీలుంది. అది ఫైట‌ర్ స‌క్సెస్ పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇంత‌కీ జ‌న‌గ‌న‌మ‌న ఎవ‌రితో సెట్ట‌వుతుందో చూడాలి.