30 ఇయ‌ర్స్ పృథ్వీ టైమ్ అలా న‌డుస్తోంది మ‌రి

అంత జీవితాన్ని ఇందుకోసం త్యాగం చేయాలా?

టాలీవుడ్ లో 30 సంవ‌త్స‌రాల కెరీర్ సాగిస్తే కానీ ఈ పొజిష‌న్ కి ఎద‌గ‌లేరా? క‌నీసం ముఖ్య‌మంత్రికి పూల దండ వేసే భాగ్యం అయినా ద‌క్క‌దా?  అంత జీవితాన్ని ఇందుకోసం త్యాగం చేయాలా?  దేవుడ‌.. ఎంక‌న్న సామీ నువ్వ‌యినా చెప్పాలి తీర్పు!! ప్చ్‌.. అయితేనేం .. ఇన్నేళ్ల త్యాగ‌ఫ‌లం ఇన్నాళ్టికి అందుకుంటున్నాడు పృథ్వీరాజ్ అలియాస్ 30 ఇయ‌ర్స్ పృథ్వీ.

ఎవ్వెరి డాగ్ హ్యాజ్ ఏ డే!

కెరీర్ ఆరంభం పొట్ట గ‌డ‌వ‌డానికే క‌ష్టంగా ఉండేది. ఇదే కృష్ణాన‌గ‌ర్, ఫిలింన‌గ‌ర్‌లో రూ.30కి అరిటాకు భోజ‌నం చేసిన స‌న్నివేశం ఉంది. ఆ త‌ర్వాత స్టార్ హోట‌ల్లో రూ.5000 భోజ‌నం కూడా తిన్నారు. అంతా క‌ళామ‌త‌ల్లి చ‌లువే. ఏదైతేనేం.. ఎవ్వెరి డాగ్ హ్యాజ్ ఏ డే. పచ్చిగా తెలుగులో చెప్పాలంటే ప్ర‌తి కుక్క‌కి ఒక రోజొస్తుంది. ఈరోజు పృథ్వీరాజ్ ది. అతడికి టైమ్ స్టార్ట‌య్యింది. ఇక ఆడుకుంటాడు అంతే!. ఇప్ప‌టికే ఏపీలో ఎంతో కీల‌క‌మైన ఎస్వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌విని అలంక‌రించాడు. అత‌డి పొజిష‌న్ చూసి తెలుగు మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం (టీఎంటీఏయు) పిలిచి మ‌రీ అధ్య‌క్షుడిని చేసింది. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)కు ధీటుగా 750 మంది స‌భ్యులు ఉన్న అసోసియేష‌న్ ఇది. ఇందులో పృథ్వీ హ‌వా సాగుతోంది. అయితే ఆయ‌న త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాల్ని ఉప‌యోగించుకుని అసోసియేష్ కి హెల్త్ కార్డులు.. ఇళ్ల స్థ‌లాలు వంటివి ప్లాన్ చేద్దామ‌ని హామీ ఇచ్చారు.

సీఎంతో మీటింగ్ ఎందుకు?

అదంతా స‌రే.. తాజాగా ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్ ని ఎందుకు క‌లిశారు? అంటే.. పృధ్వీరాజ్ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాయలంలో కలిసి ర‌హ‌స్య మంత‌నాలు సాగించార‌ట‌. అలాగే తనను చైర్మన్‌గా నియమించడంపై ధ‌న్య‌వాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  ఎస్వీబీసీ చానల్ ను ప్రారంభించి భక్తులకు అనేక సేవలు అందించే అవకాశం కల్పించారని పృథ్వీ అన్నారు. ఇప్పుడు ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్వీబీసీని మరింతగా భక్తులకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని పృధ్వీరాజ్‌ తెలిపారు. అలాగే త‌న‌ని న‌మ్మిన అసోసియేష‌న్ టీఎంటీఏయుకి ఆయ‌న విశేష సేవ‌లందించాల‌ని ఆర్టిస్టులు కోరుతున్నారు.