ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైల్వే మంత్రి లేఖ రాశారు. విజయవాడలో రైల్వేకు సంబంధించి ఆక్రమిత భూ బదలాయింపుకు సంబంధించి పీయూష్ గోయల్‌కు విన్నవించారు. రాజరాజేశ్వరిపేటలో ఉన్న రైల్వే భూములను ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. రాజరాజేశ్వరిపేట రైల్వే భూములకు బదులుగా అజిత్‌సింగ్‌నగర్ దగ్గర ఉన్న 25 ఎకరాల భూమిని రైల్వేకు ఇచ్చేందుకు సిద్ధం చేశామని సీఎం జగన్ లేఖలో తెలిపారు.
ఇప్పటికే అజిత్‌సింగ్‌నగర్ దగ్గర ఉన్న భూమిని రైల్వే, రెవెన్యూ బృందాలు పరిశీలించాయని జగన్ పేర్కొన్నారు. ఇక్కడి రైల్వే భూముల్లో దాదాపు 800 కుటుంబాలు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో 800 కుటుంబాలు రైల్వే స్థలంలో 30 ఏళ్లగా నివాసం ఉంటున్నాయి. ఈ భూమి క్రమబద్దీకరణకు దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేస్తున్న చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైల్వే శాఖకు ఉపయోగంలో లేని ఈ భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని సీఎం వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావించారు.
30 ఏళ్లుగా రాజరాజేశ్వరి పేటలో ఆక్రమణకు గురైన ఆ స్థలాన్ని రైల్వే అధికారులు వినియోగించుకోవట్లేదని, అలా నిరుపయోగంగా ఉంచడం కంటే.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడం వల్ల క్రమబద్దీకరించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే- ఆ స్థలానికి బదులుగా తాము కొత్తగా కేటాయించే స్థలాన్ని వినియోగంలోకి తీసుకుని రావడం వల్ల రైల్వేకు అదనపు ఆదాయం వస్తుందని జగన్ సూచించారు. అజిత్ సింగ్ నగర్‌లో రైల్వేకు చెందిన 25 ఎకరాల స్థలం ఉందని, దానికి కొనసాగింపుగా కొత్తగా భూమిని కేటాయిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.