ఆ నలుగురు లేదా పదిమందే పరిశ్రమను శాసిస్తున్నారా?
టాలీవుడ్ లో నిరంతరం నిర్మాతల మధ్య వార్ గురించి తెలిసిందే. ఆ పది మంది లేదా ఆ నలుగురు పరిశ్రమను శాసిస్తుండడం చాలా మంది చిన్న నిర్మాతలకు అస్సలు రుచించదు. థియేటర్లను గుప్పిట పట్టి ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ పది మంది ఆటల్ని ఆస్సలు సహించరు. పండగలు పబ్బాలు వస్తే తమ సినిమాలకు థియేటర్లు ఇవ్వరని తీవ్రంగా ఆరోపిస్తుంటారు. అయితే సినిమాలు తీయని నిర్మాతలు అంటూ ఇతరుల్ని ఎండగట్టి .. రెగ్యులర్ గా సినిమాలు తీసి రిలీజ్ చేసే మాతో పెట్టుకోవద్దని అగ్ర నిర్మాతలు లేదా ఆ నలుగురు లేదా పది మంది వాదిస్తుంటారు.
అంతేకాదు.. సినిమాలు తీయని నిర్మాతలంతా నిర్మాతల మండలిలో పోగుపడి రాజకీయాలు చేస్తున్నారని నిర్ణయాత్మక శక్తులుగా మారారన్న ఆరోపణతో కొందరు నిర్మాతలు కలిసి యాక్టివ్ నిర్మాతల గిల్డ్ అనే కొత్త సంఘాన్ని సపరేట్ కుంపటిని పెట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమాల రిలీజ్ తేదీల్ని నిర్ణయించడం సహా ఎవరు ఎలా ఉండాలో ఎవరికి థియేటర్లు ఇవ్వాలో నిర్ణయించేది కూడా వీళ్లే ఇప్పుడు. అంటే పరిశ్రమ అవాంచితంగా మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయిందన్నది ఇన్ సైడ్ ఆందోళనకారులు చెబుతున్న మాట.
ప్రస్తుత మహమ్మారీ వేళ పరిశ్రమపై రివ్యూలు చేసేది వీళ్లే. ప్రభుత్వాల్ని ప్రభావితం చేసి కథను నడిపించేది వీళ్లే. మునుముందు ఏ సినిమా రిలీజవ్వాలి? ఏ సినిమా షూటింగ్ తొలిగా పూర్తవ్వాలి? అన్నది కూడా వీళ్లే డిసైడ్ చేస్తున్నారు. పెండింగ్ షూటింగులపై గిల్డ్ నిర్మాతల రివ్యూ చేస్తోంది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తయి 20-30 శాతం షూటింగ్ పెండింగ్ ఉన్నవాటిని తక్షణమే పూర్తి చేయాలని చెబుతారట. ఆ తర్వాత దశలవారీగా ఇతర నిర్మాతలకు షూటింగులకు అనుమతులు ఇచ్చేది వీళ్లేనట. ఎవరు ముందు ఎవరు వెనక? అన్న ఆర్డర్ నిర్ణయించేది గిల్డ్ అనే ఈ మాఫియా(చిన్న నిర్మాతల ఆరోపణ)నే. మునుముందు ఇరు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎప్పుడు తెరిపించాలి? అన్నది కూడా వీళ్లే డిసైడ్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి .. జగన్ ప్రభుత్వానికి సూచిస్తారట. ఇక జూన్ లో కొన్నిటికి.. ఆగస్టులో కొందరికి షూటింగులు ప్రారంభించుకునేందుకు అనుమతులు ఇచ్చేది కూడా యాక్టివ్ గిల్డ్ మాత్రమేనని తెలిసింది. అలాంటప్పుడు నిర్మాతల మండలి ఉండి ఏం ఉపయోగం? అన్న ప్రశ్న తలెత్తింది. ప్రస్తుతం మెజారిటీ నిర్మాతలు ఉన్న మండలికి సి.కళ్యాణ్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే.