తెలుగు సినీపరిశ్రమలో ఒక రకమైన వింతైన పరిస్థితి కనిపిస్తోంది. వైరస్ దెబ్బకు పరిశ్రమ అల్లకల్లోలమే అయ్యింది. కార్మికులకు ఉపాధి కరువై ఆర్టిస్టులు టెక్నీషియన్లకు సైతం పనీ పాటా లేక ఏమీ తోచని సన్నివేశం ఉందిప్పుడు. సెట్స్ కెళదాం అనుకుంటే ఎట్నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాని పరిస్థితి.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి యాక్టివ్ నిర్మాతల గిల్డ్ తీవ్రంగా కృషి చేస్తోందట. షూటింగులు ఆగిపోవడం వల్ల రిలీజ్ లు వాయిదా పడడం వల్ల రకరకాల పరిస్థితులు పరిణామాలు ఉత్పన్నమయ్యాయి. వాటన్నిటికీ పరిష్కారం వెతుకుతోందట. ఏ సినిమా ఎప్పుడు రిలీజవ్వాలి? ఏ సినిమా ఎప్పుడు మొదలవ్వాలి? ఏ సినిమాకి ఫైనాన్స్ చేయాలి? ఇలా అన్నిరకాలుగా సమస్యల పరిష్కారానికి యాక్టివ్ గిల్డ్ సమావేశాలు ఏర్పాటు చేస్తోందట. ఇక ఇందులో 21 మంది సభ్యులతో కూడిన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ మంగళవారం సాయంత్రం ఈ తరహా మీటింగ్ ఒకటి జరిగిందని వెల్లడైంది.
త్వరగా థియేటర్లు తెరిచేస్తే సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ఆర్డర్ ని కూడా వీళ్లే డిసైడ్ చేయనున్నారు. కానీ తానొకటి తలిస్తే అన్న చందంగా తెలంగాణ- ఏపీలో అంతకంతకు కరోనా మహమ్మారీ విజృంభిస్తోంది. దీంతో షూటింగులకు కానీ.. థియేటర్లు తెరవడంపై కానీ ఇప్పట్లో క్లారిటీ వచ్చేట్టు లేదు. షూటింగులకు అనుమతులు వచ్చేసినా కానీ సెట్స్ కొచ్చేందుకు స్టార్లు ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో యాక్టివ్ గిల్డ్ ఎలాంటి జూమ్ మీటింగులు నిర్వహించినా వాటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మహమ్మారీ ఆ రకంగా అందరికీ పంచ్ వేస్తోందన్న వాదనా వినిపిస్తోంది.