కథ అనేది ఎంత కొత్తగా ఉంటే.. ఆ సినిమా అంత గొప్ప విజయతీరాలకు చేరుకుంటుందని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఏక కంఠంతో అంగీకరించే విషయం. అయితే సినిమాల్లో ఎక్కువుగా కథకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం అని మాటలు చెప్పుకుని.. తమను తాము మోసం చేసుకునే దర్సకనిర్మాతలు హీరోలే ఎక్కువమంది ఉంటారు ఇండస్ట్రీలో, అయితే గత నాలుగైదు సంవత్సరాలుగా తెలుగు సినిమా కథకు కాలం కలిసొచ్చింది. స్టార్ ఎంత బడా స్టార్ అయినా, డైరెక్టర్ ఎంత క్రియేటివిటి ఉన్నవాడు అయినా, కథ బాగాలేకపోతే ఇక ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళదు. అంటే అది కథకు ఇచ్చిన అగ్రతాంబూలం అని అనుకోవచ్చు.
అందుకే ప్రతి స్టార్ హీరో స్వయంగా కథలు గురించి ఆరా తీయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. పైగా ప్రత్యేకంగా తనకంటూ కథలను తీసుకురావడానికి ఒక టీంను పెట్టుకుంటున్నారట. బన్నీ దగ్గర నుండి మహేష్ వరకూ అందరూ మంచి కథల కోసం ఎదురుచూస్తున్న వారేనని తెలుస్తోంది. పైగా కరోనాతో కావాల్సినంత ఖాళీ టైమ్ దొరికింది అందరికీ. ఈ సమయాన్ని చక్కగా కథల కోసం సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారంతా. గత కొన్ని నెలలుగా తీరిక లేక కొత్త కథలు వినలేకపోయిన హీరోలందరూ ఈ తీరిక సమయాన్ని సాంకేతిక ద్వారా డైరెక్టర్స్ అండ్ రైటర్స్ దగ్గర నుండి కథలు వినడానికి తమ సమయాన్ని కేటాయిస్తున్నారట. అలాగే రచయితలకు లైన్ చెప్పి ఫుల్ స్క్రిప్ట్ రాయిస్తున్నారట.
మెయిన్ గా తమకు ఎలాంటి కథలు కావాలో రచయితలకు, సన్నిహితులైన దర్శకులకు వివరంగా చెప్పి మరీ వారి చేత కథలు రాయించుకుంటున్నారు మన స్టార్ హీరోలు. దర్శకులు సైతం హీరోలు ఖాళీగా ఉండటంతో తమ వద్ద ఉన్న కథలను వారి ముందుంచుతూ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకునే పనిలో పడ్డారు. మొత్తానికి కరోనా ప్రవాహంలో కూడా టాలీవుడ్ లో మాత్రం కథలు కొత్త కాంబినేషన్లు అంటూ హడావుడిగానే ఉంది. ఇక కరోనా పోయేదాకా సినిమా ఇండస్ట్రీ కోలుకున్నేలా లేదు.