‘‘ఇంతకు ముందు ఇండస్ట్రీలో శాడిజం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం అది బాగా కనబడుతోంది. వాడి సినిమా పోయిందా? వీడి సినిమా పోయిందా? అని తెలుసుకుని ఆనందం పొందేవాళ్లున్నారు. ఇది మంచిది కాదు.’’ అంటున్నారు నిర్మాత ఆచంట గోపిచంద్.
నయనతార, రాశీఖన్నా, అధర్వ ముఖ్య పాత్రల్లో దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఇమైక్క నొడిగళ్’. ఈ చిత్రాన్ని ‘అంజలి సీబిఐ’ పేరుతో నిర్మాత సిహెచ్ రాంబాబుతో కలసి అనువదించారు గోపీనాథ్ ఆచంట. గత శుక్రవారం రిలీజైన ఈ చిత్రం మంచి వసూళ్లతో ప్రదర్శితం అవుతోంది. ఈ నేపధ్యంలో ఆయన సక్సెస్ మీట్ పెట్టారు.
నిర్మాత ఆచంట గోపీనాథ్ మాట్లాడుతూ – ‘‘గతంలో రాజేంద్రప్రసాద్‌తో ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’, నిర్మాతలు భగవాన్, దానయ్య పార్ట్‌నర్‌షిప్‌తో ‘జంబలకిడిపంబ’ చేశాం. ఆ తర్వాత ‘టాప్ హీరో, దేవుడు, నాలో ఉన్న ప్రేమ’ సినిమాలు నిర్మించా. ‘బాషా’ చిత్రాన్ని హిందీలో డబ్ చేశాం. 2006 నుంచి దాసరిగారితో కలసి పని చేశా. అనుకున్నన్ని సినిమాలు ఆయనతో చేయకపోయినా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ‘అంజలి సీబిఐ’ చిత్రం సిటీలో జరిగే క్రైమ్ థ్రిల్లర్. ఇందులోని ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి అనే నమ్మకంతో డబ్ చేశాం అన్నారు.
అలాగే ‘‘రాజకీయానికి ఓటర్, సినిమాకు ప్రేక్షకుడు న్యాయ నిర్ణేతలు. వాళ్లకు నచ్చితే బ్రహ్మరథం పడతారు. మా చిత్రం ‘అంజలి సీబిఐ’ కలెక్షన్స్ మొదటి రోజు కంటే మూడో రోజు బాగా పెరిగాయి. సినిమాకు మౌత్ టాక్ పని చేస్తోంది. మంచి సినిమా చూశామనే సంతృప్తి కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు.