ట్రెండ్ సెట్ చేయాలంటే ఆర్జీవీ తర్వాతే
ఆర్జీవీ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. వివాదంతో ప్రచారం అతడి ఆయుధం. పెట్టుబడి లేని సినిమా తీయడం ఆయన విధానం. ఉచిత పబ్లిసిటీ ఆయనకు కొట్టిన పిండి. నించున్న చోటే సినిమా తీసి ఇవ్వగల సమర్థుడు. అందుకే దశాబ్ధాల పాటు సినీప్రపంచంలో అతడు నిరంతరం తన ఉనికిని చాటుకోగలిగాడు. ఇంతకుముందు యూట్యూబ్ సినిమా తీసినా.. బూతును అమ్మేసినా ఆయనకే చెల్లింది. ఇప్పుడు ఏటీటీ అంటూ సినిమాలు తీస్తున్నాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అంటూ సొంత థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ ముందే ట్రైలర్లు అమ్మేస్తున్నాడు.
అతడు ఏం చేసినా అది నూతన ఒరవడిని సృష్టిస్తోంది. ఇదివరకూ పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేయకముందే వివాదాలు క్రియేట్ చేసి ఉచిత పబ్లిసిటీ చేసుకున్నాడు. రూ.25 కి ట్రైలర్ అమ్మిన తొలి ఘనాపాటిగా రికార్డులకెక్కాడు. అది రిలీజైన కొద్ది రోజులకే మర్డర్ సినిమాని రెడీ చేసి రిలీజ్ చేసేస్తున్నాడు అప్పుడే. మర్డర్ ట్రైలర్ ఇప్పటికే రిలీజై సంచలనాలు సృష్టిస్తోంది. ఒక్క మాట అయినా లేకుండా ట్రలర్ చూపించిన ఘనుడిగా మరో కొత్త ఫార్ములాని కనిపెట్టి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఈ ట్రైలర్ ఇంకా ఇంకా దూసుకెళుతూనే ఉంది.
ఇక ఆర్జీవీ ఇప్పుడు ఈ మూవీకి విచిత్రమైన పబ్లిసటీకి తెర లేపనున్నాడని సమాచారం. కాంట్రవర్శీ అనేది తన ఉనికిని ప్రతిసారీ చాటుతుంది. అలాంటి కాన్సెప్టే ఇది కూడా. అమృత- ప్రణయ్ కులాంతర ప్రేమకథ .. ప్రణయ్ ని హత్య చేయించిన అమృత తండ్రి మారుతీరావు ఎమోషన్ నేపథ్యంలోని సినిమా ఇది. వివాదంతోనే పబ్లిసిటీ స్టార్ట్ చేసిన వర్మ ట్రైలర్ లో సైలెన్స్ తో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. పిల్లల్ని ప్రేమించడం తప్పా? అంటూ మారుతీరావునే వెనకేసుకొస్తూ క్వశ్చన్ రైజ్ చేశాడు ఆర్జీవీ. అదే కదా ఆయన ప్రత్యేకత. లోకం ఆ హత్యోదంతాన్ని కులాంతర ప్రేమ కోణంలో చూస్తే ఆర్జీవీ దానినే కూతురిపై తండ్రి ప్రేమగా చూస్తున్నాడు.
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడు వాడు సజ్జనుడు సుమతీ! అన్న చందంగా..ఆర్జీవీ అప్పటికి ఆ మాటలాడి సంపాదించుకోవడం ఎలానో నేర్చుకున్నాడు. ఇప్పుడు దానినే ఇండస్ట్రీలో ఎందరో అనుకరించాలని ప్రయత్నించి మూతులు కాల్చుకోవడం ఖాయమేనన్న మాట కూడా వినిపిస్తోంది. కొలతలు వేసి సినిమాలు తీసే చాలామందికి ఆర్జీవీ ఒక కనువిప్పు. అతడు కొట్టే ప్రతిదీ ఒక చెప్పు దెబ్బ లాంటిది! అని పొగిడేస్తే తప్పేమీ కాదు.
-శివాజీ.కె