నాలుగేళ్లుగా నంది అవార్డులు పెండింగులో ఉన్నాయి. ప్రభుత్వాలు అవార్డుల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్. అవార్డుల విషయంలో ప్రభుత్వాల ధోరణి సరికాదని అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా అవార్డుల్ని పట్టించుకోవట్లేదు. నంది అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకుంటారు. దయచేసి ఇప్పటి ప్రభుత్వం ఆ అవార్డుల్ని ఇవ్వాల్ని కోరుతున్నా. నాలుగేళ్ల నుంచీ ఆ అవార్డులు పెండింగులో ఉన్నాయి“ అని అన్నారు. జయసుధకు ఈ ఏడాది అభినయ మయూరి పురస్కారాన్ని అందజేస్తున్నామని కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా వేదికపై అతిధి మురళీమోహన్ అవార్డుల ప్రహసనంపై పైవిధంగా స్పందించారు. జయసుధతో అనుబంధం గురించి మురళీ మోహన్ మాట్లాడుతూ నాటి గోల్డెన్ డేస్ ని గుర్తు చేసుకున్నారు. జయసుధ అదివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, `జ్యోతి` సినిమా మరో ఎత్తు. ఆ సినిమాతో ఆమె నటిగా గొప్ప పేరు తెచ్చుకుంది. ఇద్దరం చాలా సినిమాల్లో కలిసి నటించాం. తను స్నేహానికి చాలా విలువిచ్చే నటి. `అభినయ మయూరి` అనే అవార్డుతో సత్కరించనుండటం ఆనందంగా ఉంది. ఏదో ఒకరోజు నాకు అవార్డును ఇస్తారని ఆశిస్తున్నా“ అన్నారు.
కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ “20ఏళ్లుగా సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. సినీ రంగానికి పురస్కారాలు ఇస్తున్నాను. జయసుధకు అభినయ మయూరి అవార్డును ఇస్తున్నాం. జయసుధ అద్భుత నటి. మనం గర్వించే నటి. 46 ఏళ్ల కెరీర్ సాగించారు. సెప్టెంబర్ 17న విశాఖపట్నంలోని కళావాహిని ఆడిటోరియంలో ఆమెకు అవార్డును ప్రదానం చేస్తాం. దానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేస్తారు“ అని తెలిపారు.