అలీ, జయసుధలపై చంద్రబాబు ఘాటు విసుర్లు

“జగన్ పార్టీలో పనిచేయడానికి వచ్చిన సినీ కళాకారులు అలీ, జయసుధ వంటివారు, తిత్లీ, హుద్‌ హుద్‌ తుపాన్లు వచ్చిన సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. వీరి సినిమా టికెట్లు కొన్న ప్రజలు, వీరిని కోటీశ్వరులను చేశారని, వీరిలో మాత్రం కనీస మానవత్వం లేకుండా పోయిందని ” అన్నారు చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ ఇలా స్పందించారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. రాజకీయవేత్తలకు తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా సినీ నటులు కూడా తమ వంతుగా ఎన్నికల ప్రచారాన్ని రక్తికట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో పలు పార్టీలకు మద్దతుగా సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో టీడీపీ తరపున దివ్యవాణి, వైసీపీ తరపున అలీ, జయసుధ వంటివారు ఉన్నారు.

ఇప్పటికే ప్ర‌ముఖ న‌టుడు ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి త‌న పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత హాస్య‌న‌టులు పృధ్వీ, కృష్ణుడు వైయ‌స్ఆర్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ప్ర‌ముఖ న‌టి జ‌య‌సుధ కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు అలీ కూడా వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఇక‌పోతే వ్యాపార వేత్త, నార్నె శ్రీ‌నివాస రావు పార్టీలో చేరారు. ఆయ‌న స్వ‌యాన జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు పిల్ల‌నిచ్చిన మామ‌. అక్కినేని నాగార్జున కూడా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారిని క‌లిశారు.

మొదటి నుంచీ సూపర్ స్టార్ కృష్ణ‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ు. రీసెంట్ గా , మోహ‌న్ బాబు కూడా ఈ పార్టీలోకి వచ్చాచరు. గ‌తంలో సినీ ఇండ‌స్ట్రీకి చెందిన కొంత‌మంది తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు. కానీ ఈ సారీ వారెవ్వ‌రూ కూడా టీడీపీకి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కూ ఎటువంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. ఇవ‌న్నీ కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకూ బ‌లాన్ని చేకూరుస్తాయో చూడలంటున్నారు రాజ‌కీయ విశ్లేషకులు.