ఇండియా- చైనా ఘర్షణపై `మేడ్ ఇన్ ఇండియా`
కరోనావైరస్ వ్యాప్తి అనంతర పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా దర్శకనిర్మాతలు స్క్రిప్టులు రెడీ చేసి సినిమాలకు సన్నాహాలు చేస్తున్న సంగతి విధితమే. కొందరు కరోనా అనే టైటిల్ తోనే సినిమాలు తీస్తున్నారు. కరోనావైరస్ కథాంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించే వీలుందన్న అంచనా ఉంది. అయితే కరోనా అనంతర పరిణామాల పైనా పలు సినిమాలు రానున్నాయి. ముఖ్యంగా ఎథికల్ హ్యాకింగ్.. డబ్బు కొట్టేయడం.. చైనా ఇండియా బార్డర్ ఇష్యూ కూడా ప్రధానంగా హైలైట్ గా కనిపిస్తోంది. ఇలాంటి సబ్ స్టోరీల్ని కూడా కరోనా కథలతో ముడి పెట్టేస్తుండడం ఆసక్తికరం.
కరోనాపై ఇప్పటికే ఆర్జీవీ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పలువురు యువ దర్శకులు ఇదే నేపథ్యంలో సినిమాల్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే వీటన్నిటి కంటే భిన్నంగా యువ దర్శకుడు దేవ్ పిన్నమరాజు ప్రయత్నం ఆకర్షిస్తోంది. సిరియా క్రైసిస్ .. అక్కడ పౌర యుద్ధం ఆధారంగా దేవ్ పిన్ తెరకెక్కించిన లఘుచిత్రం ‘ఐ ఐమ్ గొన్న టెల్ గాడ్ ఎవ్రీథింగ్’ ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అవార్డుల్ని అందుకుంది. ప్రస్తుతం అతడు వరుసగా రెండు సినిమాల్ని తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు.
హ్యాకింగ్ నేపథ్యంలో ‘డబ్ల్యూహెచ్‌ఓ’ (వరల్డ్ హజార్డ్ ఆర్డినెన్స్) త్వరలో సెట్స్ కెళ్లనుంది. ఇందులో పలాసా 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ధయాన్ అట్లూరి ఈ చిత్రాన్ని సుధాస్ మీడియా బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారతదేశంలోనే కాదు, యుఎస్ఎ, దక్షిణాఫ్రికా, ఇటలీ ఇండో-చైనా సరిహద్దులలో కూడా చిత్రీకరిస్తారు. దీంతో పాటు చైనా తో భారత్ ఘర్షణ.. చైనా వస్తు బహిష్కరణ ఆధారంగా మరో చిత్రాన్ని దేవ్ పిన్ తెరకెక్కించనున్నారు. చైనాతో దేశ ఘర్షణ కారణంగా విదేశీ వస్తు బహిష్కరణ భారతదేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రమంలోనే రెండు బర్నింగ్ ఇష్యూస్ పై నవతరం దర్శకుడు దేవ్ సినిమాలు తీస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ రెండు సినిమాల స్క్రిప్టులు రెడీ అయ్యాయి. తొలిగా డబ్ల్యూ.హెచ్.ఓ సెట్స్ కెళ్లనుంది.