యంగ్ హీరోతో ఆర్తి అగ‌ర్వాల్ ల‌వ్ బ్రేక‌ప్‌పై సినిమా?

                                       అందాల క‌థానాయిక‌ బ‌యోపిక్‌కి షురూ

నాన్-స్టాప్ బయోపిక్ ల‌తో ఇండ‌స్ట్రీ వేడెక్కిపోతోంది. ఎన్టీఆర్.. వైయ‌స్సార్.. ప‌వ‌న్ క‌ల్యాణ్.. ల‌క్ష్మీ పార్వ‌తి ఇలా ఎంద‌రో ప్ర‌ముఖుల‌పై బ‌యోపిక్ లు తెర‌కెక్కాయి. ఈ సీజన్లో దివంగ‌త‌ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ పైనా బ‌యోపిక్ తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. ఆర్తి అగ‌ర్వాల్ ఉవ్వెత్తున ఎగ‌సిప‌డిన యువ‌కెర‌టం. కెరీర్ ప‌రంగా అద్భుతంగా మెరిసింది. అటుపై  ఓ యువ‌హీరోతో ల‌వ్ ఫెయిల్యూర్ తెలిసిందే. చివ‌రికి లైపో చికిత్స ఫెయిలై మ‌ర‌ణించింది. వీట‌న్నిటి స‌మాహారంగానే ఆర్తి విషాద జీవితంపై బయోపిక్ చేస్తున్నార‌ని స‌మాచారం. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుద‌ల కావాల్సి ఉంది.

ఆర్తి అగర్వాల్ 2001 లో వెంకటేష్ `నువ్వు నాకు న‌చ్చావ్` చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. త‌రుణ్ స‌ర‌స‌న నువ్వు లేక నేను లేను చిత్రంతో మ‌రో విజ‌యం అందుకుంది. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల‌తో న‌టించింది. చిరంజీవి, నాగార్జున, బాల‌కృష్ణ వంటి స్టార్ల‌తో న‌టించ‌డ‌మే గాక‌.. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ ల స‌ర‌స‌న న‌టించింది.

ఈ మ‌ధ్య‌లోనే యువ‌హీరోతో ప్రేమ వైఫ‌ల్యంతో అమెరికా వెళ్లిపోయింది. కొంత గ్యాప్ త‌ర్వాత తిరిగి న‌టిగా రాణించేందుకు ప్ర‌య‌త్నించింది. ఆ క్ర‌మంలోనే పెరిగిన బ‌రువును త‌గ్గించుకునేందుకు లిపోసక్షన్ శస్త్రచికిత్స తర్వాత కార్డియాక్ అరెస్ట్ (గుండె నొప్పి) కారణంగా ఆర్తి ప్రాణాలు కోల్పోయింది. జూన్, 2015 లో ఆమె తుది శ్వాస విడిచింది. 2016 లో మరణానంతరం విడుదలైన ఆమె చివరి చిత్రం ఆమె ఎవ‌రు?. ఈ మూవీ రిలీజైనా చిట్ట చివ‌రిది అయిన `ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్` చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌లేదు.