త‌న సినిమాల‌పై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌కు క్లారిటీ ఇచ్చిన న‌య‌న‌తార‌

లేడీ సూప‌ర్ స్టార్‌గా ప్ర‌జ‌ల‌చే పిలిపించుకుంటున్న స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌. ఏ పాత్ర‌లోనైన ఇట్టే ఇమిడిపోయి ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ఈ అమ్మ‌డు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌లో కథానాయిక‌గా నటిస్తూ, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తోను అడ‌పాద‌డపా అల‌రిస్తుంది. ఇటివ‌లి కాలంలో ఎక్కువ‌గా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ‘వేలు నాచ్చియార్‌’ అనే చిత్రంలో యువ‌రాణిగా క‌నిపించ‌నుందంటూ ఇటీవ‌ల వార్త‌లు వచ్చాయి. ఈ సినిమా కోసం న‌య‌న‌తార గుర్రపు స్వారీ, విలు విద్య, కర్ర సాము వంటివన్నీ నేర్చుకుంటుంద‌ని కూడా అన్నారు.

1780 నుండి 1790 వ‌రకు శివ‌గంగై సంస్థానాన్ని పాలించిన వేలు నాచ్చియార్ బ్రిటీష్ ‌వారిపై పోరాడిన మొట్టమొదటి మహారాణి . తమిళనాడులోని రామనాథపురానికి చెందిన ఈ రాణి జీవితం ఆధారంగా దర్శకుడు సుశీ గణేశన్‌ ఓ చిత్రం తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో న‌య‌న‌తారని ఎంపిక చేసారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో న‌య‌న‌తార త‌న పీఆర్ టీం ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. నిరాధార వార్త‌ల‌ను క‌న్ఫ‌ర్మ్ చేసుకోకుండా ఎలా రాస్తారు. ఖ‌చ్చిత‌మైన స‌మాచారం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఏదైన చెప్పండి అంటూ న‌యన్ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది.

చివ‌రిగా న‌య‌న‌తార “అమ్మోరు తల్లి” అనే చిత్రంలో న‌టించింది. ఈ చిత్రం హాట్‌ స్టార్ లో విడుదల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న అన్నాత్తె అనే చిత్రం చేస్తుంది. ఈ చిత్ర బృందంలో నలుగురికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో చిత్రీక‌ర‌ణ‌ను తాత్కాలికంగా ఆపేశారు. జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రిలో తిరిగి షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, న‌య‌న‌తార ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే.