ఇదేం క్రియేటివిటీ బాబోయ్!!
16 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌బాస్ సీజన్ 3 మొదట్లో కొంత ఆసక్తిని రేకెత్తించినా రాను రాను గతి తప్పుతోంది. టాస్క్‌ల పేరుతో మెంటలెక్కిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. భారతదేశ సంస్కృతిని, తెలుగు లోగిళ్ల పచ్చందాన్ని తూట్లు పొడిచిన షో ఇదని సాంప్రదాయ వాదులు తిట్టి పోస్తున్నా బిగ్ బాస్ ఏదో ఒక సెక్షన్ నుంచి ఆదరణ మాత్రం ఉంది. అందుకే ఈ షో తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా రన్ అవుతోంది. ప్రస్తుతం సీజన్ 3 నాగార్జున హోస్ట్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 16 మందిలో ఎలిమినేషన్ కారణంగా 40వ ఎపిసోడ్‌కి 11 మంది మిగిలారు. ఈ 11 మందిలోనూ హిమజ ఇంటిదారి పట్టేలా కనిపిస్తోంది. వున్న 11 మంది ఓ రేంజ్‌లో ఓవరాక్షన్ తో ఈ సీజన్ నే పిచ్చెక్కించేస్తున్నారు. వారికి తగ్గట్టే వేలం వెర్రి లాంటి టాస్కుల్ని బిగ్ బాస్ ఇస్తుండటం కూడా ఈ క్రియేటివిటీ ఏంటి బాస్ అనని వారు లేరు. అంతలా బిగ్‌బాస్ టాస్క్ లు వెర్రికి పరాకాష్టగా వుండటం విచిత్రంగా వుంది.
బిగ్‌బాస్ 40వ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌లకు బిగ్‌బాస్ ఎక్స్ ప్రెస్ పేరుతో ఇచ్చిన టాస్క్ ఈ కార్యక్రమాన్ని మరింత దిగజార్చిందని చెప్పొచ్చు. హైదరాబాద్‌లో మొదలైన బిగ్‌బాస్ ఎక్స్‌ప్రెస్ ఇండియా లోని వివిధ ప్రాంతాలను చుట్టేస్తూ వుంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్ లకు పిచ్చి పిచ్చి టాస్క్‌లని ఇచ్చి బుర్ర తినేశారు. దీంతో వారి పిచ్చికి ఈ ఎపిసోడ్ పరాకాష్టగా మారింది. బుధవారం ఎపిసోడ్‌లో హనీమూన్ జంట పేరుతో రచ్చ చేసిన రవి, పునర్నవి జంట గురువారం ఎపిసోడ్‌లోనూ హద్దులు మీరిన హగ్గులతో రెచ్చిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
దీనికితోడు బాబా భాస్కర్ డైరెక్షన్‌లో వరుణ్‌తేజ్ కెమెరామెన్‌గా చిత్రీకరించిన లవ్‌స్టోరీ ఎపిసోడ్ బిగ్‌బాస్ టాస్క్ ఏ స్థాయికి దిగజారిందో అద్దంపట్టింది. ఈ షూటింగ్‌లోనూ రవిని ఆడ లేడీసు అంతా అల్లుకొని అల్లరల్లరి చేసేశారు. వీరి మధ్య చిత్రీకరించిన ఎర్రగడ్డ లవ్‌స్టోరీ షార్ట్ ఫిల్మ్ స్టోరీకన్నా దరిద్రంగా వుంది. ఇక బిగ్‌బాస్ ట్రైన్ అంతటా తిరిగేసి హైదరాబాద్ చేరుకున్న వేళ అలీరజాను శ్రీముఖి గట్టిగా కౌగిలించుకుని పిచ్చి చూపులు చూడటం ఈ ఎపిసోడ్‌కి పరాకాష్ట అని చెప్పొచ్చు. ఏం జరుగుతుందో తెలియని గందర గోళంతో కంటెస్టెంట్‌లంతా ఎవరికి తోచిన పిచ్చి చేష్టలు వాళ్లు చేస్తూ ఒక విధంగా బిగ్‌బాస్ కే పిచ్చెక్కించేలా ప్రవర్తించడం ఈ ఎపిసోడ్ ప్రత్యేకత.