‘కేసీఆర్’ విగ్రహం పెట్టాలంటూ వర్మ

ఎవరో ఒకరిని టార్గెట్ చేయకపోతే రామ్ గోపాల్ వర్మ కు మనశ్సాంతి ఉండదు. ఆయన పొగిడినా అందులో ఏదో వెటకారం కనిపిస్తూంటుంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్‌కు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుభాకాంక్షలు చెప్తున్నట్లుగా ట్వీట్ చేసారు. అయతే ఆయన తనదైన స్టైల్‌లో ట్వీట్లు చేయటంతో అది పొగడ్తో, వెటకారమో చాలా మందికి అర్దం కాలేదు. అందరు హీరోలకంటే కేసీఆర్‌ ఎంతో అందమైన వారని వర్మ అన్నారు.

‘కేసీఆర్‌ అందరు హీరోయిన్ల కంటే అందంగా ఉంటారు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆయన అందరు హీరోలకంటే అందమైన వారని, హిమాలయాల కంటే ఆకర్షణీయమైన వారని అనిపిస్తోంది’ అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా కేసీఆర్‌ గొప్పతనాన్ని చెబుతూ.. ‘మోదీ గుజరాత్‌లో పటేల్‌ విగ్రహం పెడితే.. తెలంగాణలో 2.0 రెట్ల ఎత్తైన కేసీఆర్‌ విగ్రహాన్ని ఉంచాలి’ అని వర్మ పోస్ట్ చేశారు.

ఇక మంగళవారం ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో తెరాస 88 స్థానాల్లో గెలుపొందింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.