సైరాకు శాండల్వుడ్‌లో చిక్కులు
మెగాస్టార్ చిరంజీవి నటించిన బహుభాషా చిత్రం సైరా:నరసింహారెడ్డిపై రిలీజ్ ముందు వివాదాల గురించి తెలిసిందే. ఉయ్యాలవాడ వంశీకులు కొందరు ఈ సినిమా రిలీజ్ ని ఆపేందుకు చాలానే ప్రయత్నించి విఫలమయ్యారు. కొందరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవ్వడంతో సైరా రిలీజ్ కి తీవ్ర ఆటంకాలు తప్పలేదు. ఇక టిక్కెట్ల ధరల పెంపు విషయంలోనూ రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యాయని తెరవెనక చాలానే కథ నడిచిందని ప్రచారమైంది.
అదంతా అటుంచితే రిలీజ్ తర్వాత కూడా సైరా బృందానికి చిక్కులు తప్పడం లేదు. ఓవైపు హిందీ బెల్టులో థియేటర్ల పరంగా చిక్కులు తప్పలేదు. అక్కడ హృతిక్ వార్ డామినేట్ చేయడంతో కలెక్షన్లు తీసికట్టుగా వచ్చాయి. సాహో కంటే బెటర్ టాక్ వినిపించినా సరైన ఓపెనింగ్ కలెక్షన్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. తాజాగా కన్నడ ఫిలింఛాంబర్ సైరాపై మరో బాంబ్ వేసింది. కన్నడనాట తెల్లవారు ఝాము షోలకు అనుమతులు లేకపోయినా నియమాన్ని ఉల్లంఘించి షోలు వేశారని దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని కన్నడ ఫిలింఛాంబర్ వర్గాలు హెచ్చరించాయి. పొరుగు సినిమాల రిలీజ్ లను వ్యతిరేకిస్తూ అక్కడ ప్రత్యేకించి ఓ చట్టం అమల్లో ఉంది. ఆ చట్టాన్ని సైరా పంపిణీదారులు ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. అలాగే ఉదయం 8 గంటల తర్వాత మాత్రమే షోలు వేయాలి. బెంగళూరు సహా పలు నగరాల్లో ఈ నియమాన్ని ఉల్లంఘించి స్పెషల్ షోలు వేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఒక్క బెంగళూరు నగరంలోనే 43 స్పెషల్ షోలు తెల్లవారు ఝామున వేశారని దీనిపై చర్యలు చేపడతామని కన్నడ చాంబర్ వర్గాలు హుకుం జారీ చేశాయి. ఇరుగు పొరుగు సినిమాని పరిమితంగానే అక్కడ రిలీజ్ చేయాలన్న నియమనిబంధనల వల్లనే అప్పట్లో బాహుబలి లాంటి చిత్రాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు కూడా సైరా విషయంలో అలాంటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇక చెత్త సినిమాలు తీసే కన్నడలోనూ కేజీఎఫ్ లాంటి చిత్రాన్ని తీసి తెలుగులో రిలీజ్ చేసి దండుకున్నారు. మరి ఇప్పుడు సైరాకు ఎందుకని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు? అంటూ మెగా అభిమానులు కలతకు గురవుతున్నారట.