మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఖమ్మంలో జరుగుతుంది. రామ్ చరణ్ కూడా ఈ చిత్ర షెడ్యూల్‌లో ఉన్నాడు. అక్కడ ఇల్లందు బొగ్గు గనుల్లో మూడు రోజులుగా షూటింగ్ జరుగుతుంది. అయితే సమ్మర్ కారణంగా ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్‌లో చిరుకు అనుకోని ఇబ్బందులు వచ్చినట్లు తెలుస్తుంది. వేసవి ఇంకా పూర్తిస్థాయిలో మొదలవ్వక ముందే భానుడు భగభగమంటున్నాడు.
కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మంలో అయితే ఎండలు బాగానే ఉన్నాయి. అక్కడ రికార్డు స్థాయిలో ఊష్ణోగ్రతలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అక్కడే షూటింగ్ చేస్తున్న ఆచార్య టీంకు సమ్మర్ సెగలు తగిలాయి. దాంతో మరో వారం రోజులు జరగాల్సిన షూటింగ్ ఉన్నఫలంగా ఆపేసినట్లు తెలుస్తుంది. మార్చ్ 15 వరకు ఇల్లందు గనుల్లోనే షూటింగ్ ప్లాన్ చేసాడు దర్శకుడు కొరటాల శివ. రామ్ చరణ్ కూడా అక్కడే చిరుతో పాటు ఉన్నాడు.
అక్కడి బొగ్గు గనుల్లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు కొరటాల. తమకు అక్కడ షూట్ చేసుకోడానికి అన్ని అనుమతులు జారీ చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపాడు చిరంజీవి. అయితే ఏడు రోజుల షెడ్యూల్ మూడు రోజుల్లోనే అర్ధాంతరంగా ముగిసిపోయింది. దాంతో అంతా షాక్ అవుతున్నారు. ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆ కారణంగానే ఆచార్య షూటింగ్‌కి ఇబ్బందులు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఉన్నట్లుండి షూటింగ్ ఆపేసారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత అక్కడ షూటింగ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు