మలయాళంలో సినీ ప్రయాణం మొదలు పెట్టిన అందాల తార, క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించింది. అన్ని చోట్లా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. తాజాగా తెలుగులో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ సరసన ‘రాక్షసుడు’ తో సందడి చేసింది. అతి తక్కువ సమయంలో నాలుగు భాషల్లో సినిమాలు చేస్తానని అస్సలు ఉహించలేదంటోంది.
సహజత్వమే నన్ను ఎక్కువగా ఆకర్షించే విషయం అంటోంది అనుపమ. ” ఏదైనా ఒక సినిమా చేసేటప్పుడు అన్నిటికంటే నాకు భాష ముఖ్యం. ఎంతో కొంత భాష తెలియకపోతే నేను నటించలేను. అందుకే ఏ భాషలో సినిమా చేస్తున్నా ముందు అక్కడి సినిమాలు బాగా చూస్తుంటా. అర్థం కాకపోయినా ఫర్వాలేదు. ఆలా చూడటం వల్ల మాటతీరు తెలిసిపోతుంది. ఆ తర్వాత చుట్టు పక్కల వాళ్లతో సులభంగా మాటలు కలుపుతాం. అలా భాషపై పట్టు పెంచుకుంటా. ఈ కిటుకు ఆరంభంలోనే పెట్టేశా! దాంతో ఇప్పుడు ఈ భాషలోనైనా నటించగలననే ధీమా ఏర్పడింద”ని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ!
పాత్రయినా , దాని వేషధారణ అయినా సహజంగా ఉందంటే ఆ సినిమా చేయడానికి ఎక్కువగా ఇష్టపడతానని చెప్పే అనుపమ సెట్లో ఉందంటే సందడే వేరుగా ఉంటుందట. ‘ఎప్పుడూ గలగలా మాట్లాడే స్వభావం నాది. ఇక సెట్లో ఉన్నానంటే నేనెప్పుడో కానీ కార్ వ్యాన్ లోకి వెళ్ళను. నాపై సన్నివేశాలు తీస్తున్నా, తీయకపోయినా ఆ పక్కనే ఎక్కడో ఉంటా. దాంతో ఆ సినిమాకి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. ఒక సినిమా చేసేటప్పుడు దాని గురించి నాకన్నీ తేలియాల్సిందే” అంటోంది అనుపమ! అది సరే.. మరి ఇప్పుడు తెలుగులో అవకాశాలు ఎలా ఉన్నాయ్ ఆంటే? ‘నేను కేరీర్ పరంగా చాలా హ్యాపీగానే ఉన్నాను’ అంటూ ఉడాయించింది! వామ్మో.. అనుపమా.. మజాకా!