హిందీ మార్కెట్ ప‌ట్టేస్తే ఏ హీరోకి అయినా 100కోట్లు ఫిక్స్

హిందీ మార్కెట్ విలువేమిటో మ‌న హీరోల‌కు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. క‌చ్ఛితంగా పాన్ ఇండియా స్టార్ గా నిరూపించుకోవాల‌న్న పంతం పెర‌గ‌డానికి కార‌ణం .. అక్క‌డా మార్కెట్ ఉంటే ఆ మేర‌కు సంపాద‌న ప‌దింత‌ల‌వుతుంద‌నేది ఓ ఆశ‌. తాజాగా డార్లింగ్ ప్ర‌భాస్ కి 100 కోట్ల పారితోషికం అన్న మాట‌తో ప‌రిశ్ర‌మ‌లో ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది. సాటి హీరోల్లోనూ దీనిపైనే చ‌ర్చ‌.

బ‌న్ని.. చ‌ర‌ణ్.. మ‌హేష్‌.. ఎన్టీఆర్ .. ఇలా అగ్ర హీరోలంద‌రి క‌న్ను హిందీ మార్కెట్ పైనే. పాన్ ఇండియా ప్ర‌య‌త్నాలు అయితే వ‌దిలి పెట్ట‌డం లేదు. ఇటీవ‌ల ప‌లువురు స్టార్ హీరోల ఎంపిక‌లు చూస్తుంటే క‌చ్ఛితంగా పాన్ ఇండియా మార్కెట్ ని కొల్ల‌గొట్టేయాల‌న్న పంతం క‌నిపిస్తోంది. ఇక ప్ర‌భాస్ తాజాగా కెరీర్ 21 వ సినిమా కోసం ఏకంగా 70 కోట్ల పారితోషికం దాంతో పాటే డ‌బ్బింగ్ రైట్స్ లో స‌గం మొత్తం ఖాతాలో వేసుకుంటున్నాడ‌న్న ప్ర‌చారంతో ఈ చ‌ర్చ మ‌రీ ఎక్కువైంది.

రాధే శ్యామ్ (రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో) పూర్తి చేసాక‌.. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ 21 టేకాఫ్ అవుతుంది. ఈ మూవీ త‌ర్వాత 21వ సినిమా. అటుపైనా ప్ర‌భాస్ హిందీ సినిమా చేస్తే అది కూడా దక్షిణ భారత సినిమాలో రికార్డులు కొట్టేయ‌డం ఖాయం. అప్పుడు త‌న మార్కెట్ రేంజు ఇంకా విస్త‌రిస్తుంది.