కొవిడ్ 19 మహమ్మారీ ఊహించని పంచ్ వేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీయాలన్న పంతంతో ఉన్న మన అగ్ర నిర్మాతలకు ఊహించని రీతిలో అశనిపాతమే అయ్యిందని చెప్పొచ్చు. బాహుబలి మానియాతో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. భారీ అన్ లిమిటెడ్ బడ్జెట్ల కాన్సెప్టు తెరపైకి రావడమే గాక పాన్ ఇండియా సినిమాలతో ఊహించని విధంగా కొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే వీటన్నిటికీ కరోనా పెద్ద పంచ్ వేసేసిందనే చెప్పాలి.
టాలీవుడ్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్న ప్రతి నిర్మాతకు ఇది ఊహించని పరిణామం. కరోనా వైరస్ లాక్ డౌన్లతో షూటింగులు వాయిదాలు పడడంతో కోట్లాది రూపాయల సొమ్ములు ఇరుక్కుపోయాయి. వాటిని తిరిగి రికవరీ చేయడం ఎలా? అన్న తలనొప్పి మొదలైంది. ఇప్పటికిప్పుడు డి.సురేష్ బాబు.. దిల్ రాజు.. డీవీవీ దానయ్య లాంటి టాప్ డైరెక్టర్స్ భారీ బడ్జెట్లు వెచ్చించి భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.
అయితే వీళ్లందరిలోనూ నిర్మాత దిల్ రాజు ఎక్కువగా లాక్ అయినట్టు ప్రచారం అవుతోంది. ఆయన ఇప్పటికే మూడు సినిమాలు తీస్తున్నారు. వీటిలో పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ పై భారీగా బడ్జెట్ వెచ్చించారు. దీంతో పాటే హిందీలో జెర్సీ రీమేక్ చిత్రానికి పెట్టుబడులు సమకూరుస్తున్నారు. ఇవి వచ్చే ఏడాది వేసవి నాటికి కానీ రిలీజ్ కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ సొమ్ములు రికవరీ ఎలా? అన్న ఆందోళన కనిపిస్తోందిట. దీంతో పాటే సుధీర్ బాబు – నానీ కథానాయకులుగా తెరకెక్కించిన `వీ` చిత్రాన్ని ఈ ఏడాది దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు. అయితే కొవిడ్ కల్లోలం నేపథ్యంలో జనం థియేటర్లకు వస్తారా రారా? అన్న టెన్షన్ వెంటాడుతోంది. ఆ మూడు సినిమాల పేరుతో దాదాపు 150-200 కోట్ల పెట్టబుడులు పెడుతున్న నిర్మాతలో ఆందోళన మాత్రం వదిలిపోవడం లేదట.
