మద్రాసు నుంచి పరిశ్రమ హైదరాబాద్ కి తరలి వచ్చింది. అప్పట్లోనూ అది సాధ్యమా? అన్నారు. కానీ సాధ్యం చేసి చూపించారు. సినీభీష్ముడు ఎల్వీ ప్రసాద్.. అన్నగారు ఎన్టీఆర్.. అందగాడు ఏయన్నార్.. సూపర్ స్టార్ కృష్ణ.. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు.. మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు.. సహా పలువురు దిగ్గజాలు మద్రాసు నుంచి హైదరాబాద్ కి పరిశ్రమ వచ్చే వరకూ వదిలిపెట్టలేదు. ఇక్కడ స్టూడియోల ఏర్పాటు సహా మౌళిక వసతుల కల్పన చేశారు. రికార్డింగ్ స్టూడియోలు.. ల్యాబులు ప్రారంభించి అతి పెద్ద భీజం వేయడం వల్లనే టాలీవుడ్ తరలి వచ్చింది.
ఇప్పుడు అలాంటి అవకాశమే వైజాగ్ కి ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాక పరిశ్రమ వైజాగ్ కి తరలి వెళ్లిపోవాల్సిందే. కానీ నయానా భయానా చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ అభయం ఇవ్వడంతో హైదరాబాద్ నుంచి పరిశ్రమ కించిత్ కూడా కదల్లేదు. ఓవైపు తెలంగాణ వాదులు ఆంధ్రోళ్లు అంటూ తిట్టి చీవాట్లు పెట్టి తరిమేయాలని చూసినా కానీ ఆంధ్రా సినిమావాళ్ల ఆస్తులన్నీ ఇక్కడ పోగుపడడం వల్లన వెంటనే కదిలి వెళ్లలేదు. అయితే స్వ- పర అనే విభేధాలు పరిశ్రమలో ఇంకా సమసిపోలేదు. అవి నివురుగప్పిన నిప్పులా పొంచి ఉన్నాయన్న సంగతి ఇప్పుడిప్పుడే సినీపెద్దలకు అర్థమవుతోంది. ఆ క్రమంలోనే వైజాగ్ టాలీవుడ్ అవసరాన్ని గుర్తించినట్టే కనిపిస్తోంది.
ఇకపోతే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ టాలీవుడ్ ఏర్పాటుపై చంద్రబాబు కంటే బెటర్ గా స్పందిస్తుండడంతో ఇదే అదనుగా మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీపెద్దలు విశాఖ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటుపై ఆలోచిస్తుండడం వేడెక్కిస్తోంది. అక్కడ స్టూడియోల నిర్మాణానికి జగన్ భూములు ఇస్తారని ప్రచారమవుతోంది. అయితే ఇది సాధ్యమేనా? నేటి 3 పీఎం భేటీలో దీనిపై చిరంజీవి ప్రభృతులు ప్రధానంగా మంతనాలు సాగిస్తారా? అన్నది వేచి చూడాలి. కేవలం నంది అవార్డులు.. సమస్యలు అంటూ కాలయాపన చేస్తారా? లేక అసలు సంగతి తేలుస్తారా? అన్నది చూడాలి. ఇక ఏపీలో ప్రతిపక్షమైన తేదేపా అన్నివిధాలా విఫలమైంది. జగన్ సంక్షేమ పథకాలు .. రైతు పథకాలు వర్కవుటై మరోసారి అతడే సీఎం అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే పునాది రాయి వేస్తే వైజాగ్ టాలీవుడ్ ఖాయమైనట్టేనన్న విశ్లేషణలు జోరందుకున్నాయి.
మరి దీనికి చిరంజీవి- రాజమౌళి లాంటి సినీపెద్దలే గట్టిగా కృషి చేయాలి. ఒకవేళ విఫలమైతే అది చారిత్రక తప్పిదమే అవుతుంది. ఇలాంటి మరో అవకాశం మెగాస్టార్ కి వస్తుందని భావించలేం. దాసరి తర్వాత ఆయన పరిశ్రమ పెద్దగా ఉన్నారు. అందుకే ఇది అరుదైన అవకాశం. మళ్లీ మళ్లీ రాని అవకాశం. సినీపెద్దలు.. ముఖ్యమంత్రి కలిస్తే ఏదైనా సాధ్యమే. రాజుగారే తలుచుకుంటే దేనికీ కొదవ ఉండదు. అందుకే అసలు ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ అటు విశాఖ- ఉత్తరాంధ్ర యూత్ లో ఉంది. మరి కాసేపట్లో సీఎం జగన్ తో చిరంజీవి సినీపెద్దల భేటీ జరగనుంది. దీనికి పరిశ్రమ నుంచి ఎనిమిది మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఏం చర్చిస్తారు? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రయత్నిస్తే పోయేదేముంది? కొత్త ఇండస్ట్రీ.. ఔత్సాహిక యువతకు ఉపాధి.. ఏపీకి గ్లామర్ అద్దుకుంటుంది మరి.
-శివాజీ.కె