వైజాగ్ టాలీవుడ్ నిర్మాణంపై ఆసక్తిగా ఉన్న రాజకీయ నాయకులు సినీపెద్దలు ఎవరెవరు? అన్నది పరిశీలిస్తే ఆసక్తికర సంగతులే తెలిశాయి. బీచ్ సొగసుల విశాఖ నగరాన్ని మరో హాంకాంగ్ సినీపరిశ్రమలా చూడాలన్నది పలువురి ప్లాన్. ఇక దీనికి ప్రస్తుత ఏపీ సీఎం జగన్ నుంచి సానుకూల స్పందన లభించడంతో ఆ దిశగా సినీపరిశ్రమ ప్రముఖులు సీరియస్ గానే ఆలోచిస్తున్నారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు దీనిపై పూర్తి ఆసక్తిగా ఉన్నారు. వైజాగ్ లో స్టూడియోల నిర్మాణం కోసం ఆసక్తిగా ఉన్నారు. వారిలో చిరంజీవి, రాజమౌళి సహా మెగా నిర్మాత కే.ఎస్.రామారావు, కింగ్ నాగార్జున, దగ్గబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, సి.కళ్యాణ్ సహా పలువురు పెద్దలు ఉండగా రాజకీయ నాయకుల్లోనూ చెప్పుకోదగ్గ పేర్లు వినిపిస్తున్నాయి.
నాయకుల్లో ముఖ్యంగా భీమిలి వైకాపా మంత్రి అవంతి శ్రీనివాసరావు (ముత్తంశెట్టి శ్రీనివాసరావు), జగన్ అనుయాయుడు మంత్రి విజయ సాయి రెడ్డి, మంత్రి పేర్ని నాని.. ఎట్టిపరిస్థితుల్లో వైజాగ్ టాలీవుడ్ ని అభివృద్ధి చేయాలన్న ధృఢ సంకల్పంతో ఉన్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇక వీరందరికీ బాసటగా విశాఖ తేదేపాలో కీలక నాయకుడైన గంటా శ్రీనివాసరావు సైతం వైజాగ్ టాలీవుడ్ పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక గంటా మెగాస్టార్ చిరంజీవికి ఎంతో సన్నిహితుడు కావడంతో తొలి నుంచి విశాఖలో తెలుగు సినీపరిశ్రమను అభివృద్ధి చేయాలని కోరుతూనే ఉన్నారు. ఇక పలు సందర్భాల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సైతం వైజాగ్ టాలీవుడ్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆసక్తిగా ఉన్నారని ప్రకటించారు. విశాఖ ఉత్సవ్ 2020 వేడుకల్లో మంత్రి అవంతి `వైజాగ్ టాలీవుడ్` పై కీలక ప్రకటన చేయడంతో సీఎం జగన్ ఆలోచన అందరికీ స్పష్ఠమైంది. దీనిపై హైదరాబాద్ టాలీవుడ్ మీడియాలోనూ ఆసక్తికర చర్చ సాగింది.
తాను ప్రాతినధ్యం వహిస్తున్న భీమిలి పరిరసాల్లోనే వైజాగ్ టాలీవుడ్ ఏర్పాటు చేస్తారని కూడా వైకాపా సీనియర్ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. కాపులుప్పాడ పరిసరాల్లో రాజధానిని ఏర్పాటు చేయడంతో పాటు విశాఖ టాలీవుడ్ పై జగన్ చాలా క్లారిటీతో ఉన్నారని ప్రకటించారు. ఇక విశాఖలోని పలువురు ఎమ్మెల్యేలు టాలీవుడ్ రాక కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. విశాఖ వాసులు సహా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పరిశ్రమ తరలింపుపై ఎగ్జయిటెడ్ గా ఉన్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి. వైజాగ్ కు రాజధాని తరలింపు.. టాలీవుడ్ తరలింపు తప్పనిసరిగా జరగాలని ఆ నాలుగు జిల్లాల వారితో పాటు తూగో- ప.గో జిల్లాల ప్రజల ఆకాంక్షగా చెబుతున్నారు. ఇక విశాఖలో టాలీవుడ్ ని అభివృద్ధి చేయాలని అమరావతి- గుంటూరు బెల్ట్ కృష్ణా-ప్రకాశం వాసులు మీడియా సాక్షిగా కోరుకోవడం ఆసక్తికరం.
అమరావతి రాజధాని.. అక్కడ రియల్ వెంచర్ల అభివృద్ధి పైనే దృష్టి సారించిన చంద్రబాబు అండ్ కోకి విశాఖ టాలీవుడ్ ఏర్పాటు అవకాశం ఇవ్వకూడదని సీఎం జగన్ భావిస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే 300 ఎకరాల్లో ఫిలిం స్టూడియోల ఏర్పాటు సహా చిరంజీవిని ప్రాతినిధ్యం వహించేలా యువ ముఖ్యమంత్రి ప్రోత్సహించడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. విశాఖ భీమిలి నుంచి అటు కొత్తవలసం- అరకు మధ్యలో పరిశ్రమ ఏర్పాటు ఉండనుంది. దాదాపు 2000 ఎకరాలు వైజాగ్ టాలీవుడ్ కోసం కేటాయించనున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.