ఆ నలుగురు రేస్‌లో ఉన్నారా?
వైజాగ్ (విశాఖ) టాలీవుడ్ ప్రస్తుతం హాట్ టాపిక్. నవ్యాంధ్రప్రదేశ్ నగరం.. బీచ్ సొగసుల విశాఖపట్నంలో టాలీవుడ్‌ను స్థాపించి అభివృద్ధి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనికి అన్నివిధాలా సాయానికి ముందుకొచ్చారు. మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబులతో సహా టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం తరువాత సీఎం రకరకాల విషయాలపై స్పష్ఠతతో ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు మరో కొత్త పరిశ్రమ పురోభివృద్ధికి సీఎం హామీ ఇచ్చారు. ఇది మొత్తం టాలీవుడ్‌ను ఆకర్షిస్తోంది. పరిశ్రమ వ్యక్తులు స్టూడియోలు కట్టేందుకు స్థలాల్ని ఇచ్చేందుకు అంగీకరించారు. అక్కడ సినీప్రముఖులు తరలి వస్తే.. ఇండ్ల నిర్మాణానికి సాయపడతామని మంత్రి పేర్ని నాని ప్రామిస్ చేశారు. ఈ ప్రతిపాదనను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ప్రస్తుతం సినీ ప్రముఖులు చర్చలు జరుపుతున్నారు.
తాజా పరిణామంతో విశాఖ సహా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా యూత్ లో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తొలిగా ఏ టాలీవుడ్ స్టార్ విశాఖపట్నంలో స్టూడియోను ఏర్పాటు చేస్తారు? అన్నదానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. మెగా స్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ సంయుక్తంగా ఒక స్టూడియోని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని ప్రచారమవుతోంది. అలాగే నాగార్జున, ఎస్.ఎస్.రాజమౌళి, దిల్ రాజు స్టూడియోల ఏర్పాటు కోసం రేసులో ముందున్నారు. దివంగత నిర్మాత మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు ఇప్పటికే రుషికొండ, విశాఖపట్నం సమీపంలో ఒక స్టూడియోను నిర్మించారు. వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ గా ఇది పాపులరైంది. ఆయన వారసుడు డి.సురేష్ బాబు దీనిని మరింత అభివృద్ధి చేసే ప్రణాళిల్లో ఉన్నారు. ప్రఖ్యాత ఏవీఎం స్టూడియోస్ సైతం విశాఖలో స్టూడియోను స్థాపించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసింది.
నందమూరి బాలకృష్ణ సైతం వైజాగ్ టాలీవుడ్ లో స్టూడియో నిర్మించాలన్న ఆసక్తితో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీఎఫ్‌డీసీకి అనుమతుల కోసం స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన ఇప్పటికీ విశాఖలో స్టూడియోని స్థాపించాలన్న పట్టుదలతో ఉన్నానని ఇంటర్వ్యూల్లో తెలిపారు. అయితే ఆయన ప్రతిపక్ష పార్టీ తేదేపాకు చెందినవాడు కాబట్టి ప్రస్తుత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అందుకు అవకాశం కల్పిస్తారా? అన్న సందేహాలు ఉన్నాయి. అహం వదిలేసి బాలకృష్ణకు జగన్ ఆ అవకాశం ఇస్తారా? విశాఖపట్నంలో ఒక స్టూడియో ఏర్పాటుకు అనుమతించి సరికొత్త చరిత్రకు కారణమవుతారా? అంటూ ఆసక్తికర చర్చ సోషల్ మీడియాల్లో సాగుతోంది.