వైజాగ్ టాలీవుడ్ ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, తెలంగాణ డివైడ్ తర్వాత పరిశ్రమ వైజాగ్ కి తరలి వెళుతోందని ప్రచారమైనా తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవతో ఎవరూ ఎటూ వెళ్లలేదు. కానీ ఏదో ఒకరోజు ఏపీకి గ్లామర్ ఇండస్ట్రీ తరలి వెళ్లాల్సిన సందర్భం ఉంటుందని పలు సందర్భాలు నిరూపించాయి. అప్పట్లోనే కేసీఆర్ – కేటీఆర్ బృందం .. వైజాగ్ లో మరో టాలీవుడ్ ఏర్పడుతుందని అందుకు సినీపెద్దలు ఆసక్తిగా ఉన్నారని ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు హయాంలో హడావుడి తప్ప జెన్యూన్ గా ఎలాంటి ప్రయత్నం జరగకపోవడంతో కొత్త పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడలేదు. మాజీ సీఎంతో పోలిస్తే ప్రస్తుత యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏపీకి టాలీవుడ్ ని తరలించాలనే కృత నిశ్చయంతో ఉన్నారని ఇదివరకూ మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీప్రముఖుల భేటీతో దీనిపై మరింత క్లారిటీ వచ్చినట్టయ్యింది.
ఈ భేటీలో తెలుగు సినీపరిశ్రమ షూటింగులకు అనుమతులు కోరడంతో పాటు విశాఖలో స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీలతో భూములు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. దీనిపై జగన్ తో సుదీర్ఘంగా చర్చ సాగింది. ఈ భేటీలో స్టూడియోల నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి మీడియాకు వెల్లడించారు. పరిశ్రమకు ఏం కావాలో అడగాలని జగన్ భేటీలో అన్నారని తెలిపారు. అంతేకాదు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టాలీవుడ్ కోసం 350 ఎకరాలు కేటాయించారని దానికి జీవో కూడా రిలీజైందని చిరంజీవి వెల్లడించారు. అలాగే 2019-20 సంవత్సరానికి నంది అవార్డుల ప్రకటన సహా పలు అంశాలపైనా చర్చించామని అన్నారు. జూన్ 15 నుంచి ఏపీలో షూటింగులు చేసుకునేందుకు సినిమా.. టీవీ రంగాలకు సీఎం జగన్ అనుమతించారన్నారు.
అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు పరిశ్రమ ప్రముఖులు తరలి వస్తామని అంటే.. అక్కడ తక్కువ ధరకు భూములు ఇస్తామని.. స్టూడియోల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తక్కువ ధరకు భూములు ఇవ్వడమే గాక సినీప్రముఖులు ఇక్కడ స్థిరపడేందుకు హౌసింగ్ స్కీమ్స్ ని కల్పిస్తామని పేర్ని అన్నారు. వైజాగ్ స్టూడియోల ఏర్పాటు విషయమై మరోసారి సీఎం జగన్ సినీప్రముఖులతో భేటీ అవుతారని వెల్లడించారు.