ఆ నలుగురు ఎంపీలు నక్కతోక తొక్కినట్టున్నారు..!

ఏపీ అధికార పార్టీ నుంచి కొద్ది రోజుల క్రితం రాజ్యసభకు ఎన్నికైన నలుగురు ఎంపీలకు ప్రమోషన్ దక్కింది. 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎం జగన్ ఎమ్మెల్సీ కోటాలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లకు తొలి కేబినెట్‌లో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల వారిద్దరిని మంత్రి పదవి నుంచి తప్పించి జగన్ రాజ్యసభకు పంపారు. తాజాగా వీరిద్దరి స్థానంలో రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజుకు జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరిద్దరు కూడా నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, వారి వారి శాఖలను కూడా కేటాయించారు.

అయితే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లతో పాటు అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానిలను కూడా జగన్ రాజ్యసభకు పంపారు. అయితే వీరంతా నక్క తోక తొక్కి రాజ్యసభలో అడుగుపెట్టారో ఏమో తెలీదు కానీ ఎన్నికైన కొద్ది రోజుల్లోనే వీరిని అదృష్ట దేవత వరించినట్టుంది. ఒకేసారి నలుగురుకి కీలక పదవులు దక్కాయి. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావును బొగ్గు, ఉక్కు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పరిమల్ నత్వాని ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, అయోధ్య రామిరెడ్డి పట్టణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఉత్వర్వులను విడుదల చేశారు.